Avanigadda News: దివిసీమను ఈసారి ఏలేదెవరో? జనసేన బోణీ కొట్టేనా! వైసీపీ మళ్లీ నిలబెట్టుకునేనా?
Avanigadda Candidate: కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అవనిగడ్డలో తెలుగుదేశం పట్టు నిలుపుకుంది. ఈసారి మిత్రపక్షానికి అవకాశం ఇవ్వగా...వైసీపీ రెండోసారి విజయం కోసం పరితపిస్తోంది.
Avanigadda Constituency: కృష్ణా జిల్లాలోని తీరప్రాంత నియోజకవర్గమైన అవనిగడ్డ(Avanigadda)కు ఒకవైపు కృష్ణనది ఉండగా... మరోవైపు సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. కృష్ణానది సముద్రంలో కలిసేది ఇక్కడే. మచిలీపట్నం(Machilipatnam) పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డ కృష్ణా డెల్టాలోని కీలక ప్రాంతం. కాంగ్రెస్, తెలుగుదేశం(Telugudesam) పోటాపోటీగా గెలుపొందిన అవనిగడ్డలో ప్రస్తుతం వైసీపీ(YCP) పాగా వేసింది. ఆ పార్టీ నుంచి సింహాద్రి రమేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కాంగ్రెస్ కంచుకోట
అవనిగడ్డ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. అప్పట్లో కృష్ణా జిల్లావ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నా...అవినిగడ్డలో మాత్రం కాంగ్రెస్(Congress) బలంగా ఉంది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డ శివరామప్రసాద్(Yarlagadda Sivaram Prasad) విజయం సాధించారు. ఆ తర్వాత 1967లోజరిగిన ఎన్నికల్లోనూ మరోసారి ఆయనే గెలుపొందారు. ఆ తర్వాత 1972 జరిగిన ఎన్నికల్లో మాజీమంత్రి మండలి కృష్ణారావు(Mandali Krishnarao) విజయం సాధించారు. వరుగా మూడుసార్లు గెలిచి ఆయన హ్యాట్రిక్ సాధించారు. 1978, 1983లోనూ విజయం సాధించి దివిసీమ(Diviseam)పై చెరగని ముద్ర వేశారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థి అర్జున్‌రావు పై విజయం సాధించారు 1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినా...అవనిగడ్డలో మాత్రం కాంగ్రెస్ తరఫున మండలి కృష్ణారావు గెలుపొందడం విశేషం. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి వక్కపట్ల శ్రీరామ్‌ప్రసాద్‌పై విజయం సాధించారు.
తెలుగుదేశం హ్యాట్రిక్ విజయాలు
1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి సింహాద్రి సత్యనారాయణరావు(Simhadri Satyanarayana) విజయం సాధించారు. మూడుసార్లు వరుసగా గెలిచిన మండలి కృష్ణారావును ఆయన ఓడించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే పోటీ చేయగా కేవలం 167ఓట్ల తేడాతో సింహాద్రి సత్యనారాయణ విజయం సాధించడం విశేషం. 1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినా అవనిగడ్డలో కాంగ్రెస్ గెలిచింది. 1989లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచినా అవనిగడ్డలో మాత్రం ఓటమిపాలవ్వడం విశేషం. 1994లో తెలుగుదేశం నుంచి మరోసారి సింహాద్రి సత్యనారాయణ పోటీ చేయగా...కాంగ్రెస్ తరపున మండలి కృష్ణారావు తనయుడు బుద్ధప్రసాద్ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లోనూ వరుసగా మూడోసారి గెలిచి సింహాద్రి సత్యనారాయణ హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి మండలి బుద్దప్రసాద్(Mandali Budha Prasad) పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి బూరగడ్డ రమేశ్‌నాయుడుపై కేవలం 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2004లోనూ కాంగ్రెస్ నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేయగా...తెలుగుదేశం బూరగడ్డ రమేశ్‌నాయుడిని పోటీకి నిలపింది. ఈ ఎన్నికల్లోనూ మండలి గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తండ్రిలాగా హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన మండలి బుద్ధప్రసాద్.... 2009లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం నుంచి అంబటి బ్రాహ్మణయ్య(Ambati Brahamiah) పోటీ చేసి స్వల్ప ఓట్లు 417 తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి సింహాద్రి రమేశ్(Simadri Ramesh) పోటీపడి మండలి గెలుపు అవకాశాలను దెబ్బతీశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశంలో చేరారు.
అప్పుడు తండ్రులు... ఇప్పుడు తనయులు పోటీ
2014 ఎన్నికల్లో అవనిగడ్డలో ఆసక్తికర పోటీ నడిచింది. తెలుగుదేశం నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీపడగా...వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్ బరిలో నిలిచారు. గతంలో వీరి తండ్రులు సైతం ప్రత్యర్థులుగ పోటీపడ్డారు. కాకాపోతే రమేశ్ తండ్రి తెలుగుదేశం నుంచి పోటీలో ఉండగా..ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మండలి కృష్ణరావు తనయుడు తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ నుంచి పోటీపడ్డారు. తన తండ్రిని ఓడించిన సింహాద్రి సత్యనారాయణ కుమారుడు రమేశ్‌ను ఈ ఎన్నికల్లో ఓడించి మండలి బుద్ధప్రసాద్ బదులు తీర్చుకున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఉపసభాపతి పదవి సైతం దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి వీరిద్దరే పోటీ చేయగా...వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పొత్తులో భాగంగా ఈసారి ఈసీటును తెలుగుదేశం మిత్రపక్షాలకు కేటాయించగా...వైసీపీ నుంచి మాత్రం మరోసారి సింహాద్రి రమేశ్ బరిలో దిగుతున్నారు.