అనిల్ సవాల్‌కు టీడీపీ రియాక్షన్- నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాస్టార్‌కే ఛాన్స్!
2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తుండగా, రూరల్ నుంచి దాదాపుగా శ్రీధర్ రెడ్డి ఖరారైనట్టే లెక్క. ఈ ఇద్దరి కాంబినేషన్ నెల్లూరులో టీడీపీకి విజయం సాధించి పెడుతుందని పార్టీ ప్లాన్.
2019 ఎన్నికల్లో 1988 ఓట్ల స్వల్ప మెజార్టీతో నెల్లూరు సిటీ నుంచి అప్పటి మంత్రి నారాయణపై గెలుపొందారు అనిల్ కుమార్ యాదవ్. ఆ టఫ్ ఫైట్‌ని ఇంకా నెల్లూరు వాసులు మరచిపోలేదు. అన్నీ అనుకూలిస్తే ఈసారి కూడా అదే ఫైట్ కొనసాగేలా ఉంది. టీడీపీ నెల్లూరు సిటీకి అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి నారాయణే ఈసారి కూడా నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరపున బరిలో నిలుస్తారని ప్రకటించారు చంద్రబాబు. ఆయన్ను నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జ్ ని చేశారు.
అనిల్ కి టికెట్ ఇస్తారా..?
నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనంటున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇటీవల పలు సందర్భాల్లో ఆయన సవాళ్లు కూడా విసిరారు. తాను వైసీపీ తరపున పోటీ చేస్తానని, టీడీపీ తరున ఆనం రామనారాయణరెడ్డి వస్తారా లేక లోకేష్ వస్తారో తేల్చుకోవాలన్నారు. నారా లోకేష్ వచ్చినా ఆయన్ని ఓడిస్తానన్నారు. ఈ సవాళ్ల సంగతి పక్కనపెడితే చంద్రబాబు మాత్రం నెల్లూరు సిటీ అభ్యర్థిగా నారాయణను ఖరారు చేయడం విశేషం.
ఇప్పటి వరకూ నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జ్ గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్తున్నా.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పుకోలేదు. నారాయణ మనిషిగానే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నారాయణే మళ్లీ పోటీ చేస్తారని చూచాయగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే ఖరారైంది. గత ఎన్నికల తర్వాత నెల్లూరుకి రాకపోకలు తగ్గించిన నారాయణ మళ్లీ ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తెరపైకి వచ్చారు. ఇప్పుడు సిటీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. నారాయణకు చోటివ్వడంతో సిటీ ఇన్ చార్జ్ గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు చంద్రబాబు.
శ్రీధర్ రెడ్డి, నారాయణ కాంబినేషన్..
2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తుండగా, రూరల్ నుంచి దాదాపుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖరారైనట్టే లెక్క. ఈ ఇద్దరి కాంబినేషన్ నెల్లూరులో టీడీపీకి విజయం సాధించి పెడుతుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ ఈసారి కలసి పనిచేయబోతున్నారు. గతంలో నారాయణ ఓటమికోసం నెల్లూరు సిటీలో కూడా తన వ్యూహాలు అమలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇప్పుడు ఆయన గెలుపుకోసం కృషిచేయబోతున్నారు. అందులోనూ కోటంరెడ్డి వైసీపీని వీడి బయటకొచ్చాక... అనిల్ వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ పై బదులు తీర్చుకోవాలంటే అక్కడ నారాయణ గెలిచి తీరాలి. అందుకే కోటంరెడ్డి టీమ్ కూడా నారాయణకు ఫుల్ సపోర్ట్ చేయబోతోంది. సిటీలో తనకున్న పలుకుబడి ఉపయోగించి నారాయణ గెలుపుకోసం కోటంరెడ్డి ప్రయత్నాలు చేయబోతున్నారు.
నెల్లూరు సిటీలో నారాయణకు మంచి సంబంధాలున్నాయి. గత ఎన్నికల సమయంలో నెల్లూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వాటి వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లు పగలగొట్టి పనులు మొదలు పెట్టడంతో.. ప్రజలు అవస్థలు పడ్డారు. ఆ అవస్థలన్నీ ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో నారాయణకు వ్యతిరేకంగా మారాయి. ఈసారి అనిల్ కి అలాంటి అభివృద్ధి పనులే ఆటంకంగా మారే అవకాశముంది. నెల్లూరు నగరంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్, ఇతర అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. దీంతో అనిల్ పై ఆ వ్యతిరేకత కనిపించే అవకాశముందని తెలుస్తోంది.