Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhrapradesh News: రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని.. ఎవరికీ రక్షణ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి ప్రజాగళం సభలో వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు.
Chandrababu Slams Cm Jagan in Kavali Prajagalam Meeting: ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ (CM Jagan) ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో (Kavali) శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం (Prajagalam) సభలో ఆయన ప్రసంగించారు. జగన్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని.. చట్టాలపై గౌరవం లేదని అన్నారు. 'బాబాయిని చంపిన వారికి ఎంపీ సీటు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ వంటి వ్యక్తి సీఎం అవుతారని నేను ఏనాడూ ఊహించలేదు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను జగన్ తరిమికొట్టారు. వైసీపీ నేతలు ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. వారి వేధింఫులు తాళలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. దళారీ వ్యవస్థకు బీజం వేసిన వ్యక్తి జగన్. వైసీపీ నేతలు వస్తుంటే జనం పారిపోతున్నారు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. అధికారం అహంకారంతో అందరికీ అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్. ఏపీలోనే ఎక్కువ మంది పేదలున్నారు. పేదవారు ఎవరో పెత్తందారులు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి. మేము అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. పిల్లలు, యువత భవిష్యత్తుకు నాది గ్యారెంటీ' అంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు.
టీడీపీతోనే భవిష్యత్తు
రాష్ట్ర ప్రజలకు టీడీపీ వల్లే భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎన్డీయే అన్ స్టాపబుల్ అని.. ఎటు చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. 'ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే ఆయన పార్టీని స్థాపించారు. తెలుగు జాతికి ఈ రోజు ఎంతో గొప్పది. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు నేను మీ ముందుకు వచ్చాను. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. చెత్తపై కూడా పన్ను వేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. డీఎస్సీని పూర్తిగా ఇవ్వలేదు. ఐదేళ్లలో అంతా నష్టపోయారు. నేను సీఎంగా ఉన్నప్పుడు 9 సార్లు డీఎస్సీ వేశాం. పేద పిల్లలు ఉన్నత విద్య చదువుకునేలా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి ప్రోత్సహించాం. జాబు కావాలంటే బాబు రావాలి. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్ రిక్రూట్ మెంట్ కూడా నిర్వహిస్తాం. మత్స్యకారులను ఆదుకుంటాం. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500.. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. సీఎం జగన్ హయాంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారు. ప్రజల కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలి.' అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్ దహనం