Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Dravidian Politics BJP Alliance: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పు కనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేకత, గో బ్యాక్ మోదీ నినాదాల స్థానంలో ప్రధాని పర్యటనకు సానుకూలత వచ్చింది. ఇది దేనికి సంకేతం?

Modi Tamil Nadu Development Projects: తమిళనాడు రాజకీయ వేదికపై దశాబ్దాలుగా నడుస్తున్న సిద్ధాంత పోరాటంలో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోంది. ఒకప్పుడు ద్రవిడ ఆత్మగౌరవం, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి , హిందీ వ్యతిరేక నినాదాలతో జాతీయ పార్టీలను, ముఖ్యంగా కాషాయ రాజకీయాలను నిరంతరం శత్రువుగా చిత్రీకరించడమే తమిళనాడులో గెలుపు మంత్రంగా ఉండేది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన తమిళనాడులో అడుగుపెట్టిన ప్రతిసారీ విపక్షాలు, తమిళ జాతీయవాద సంఘాలు గో బ్యాక్ మోదీ నినాదాలతో విరుచుకుపడేవి. నల్లజెండాలు, ఆకాశంలోకి ఎగిరే నల్ల బెలూన్లు ప్రధాని పర్యటనలకు నిరసన కాన్వాయ్‌లుగా మారిన రోజులను తమిళనాడు చూసింది. కానీ, ల చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభోత్సవంతో పాటు రూ. 13,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ పర్యటించిన తీరును పరిశీలిస్తే, రాష్ట్రీయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మోదీ పర్యటనలో కనిపించని నిరసనలు
ఈ సారి ప్రధాని పర్యటన వేళ గాలిలో నల్ల బెలూన్లు కానీ, రోడ్లపై భయానక నిరసనలు కానీ ఎక్కడా కనిపించలేదు. రాజకీయ వైరుధ్యాలు పక్కనబెట్టి, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ప్రధానితో ఒకే వేదికను పంచుకోవడమే కాకుండా, మెట్రో రైలులో పక్కపక్కనే కూర్చుని ప్రయాణించడం తమిళనాడు క్షేత్రస్థాయి రాజకీయాల్లో వచ్చిన గుణాత్మక మార్పునకు అద్దం పడుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కేంద్ర పెద్దల పర్యటనను నిరసనలతో హోరెత్తించే సంస్కృతి స్థానంలో ఇప్పుడు సంయమనం, పరస్పర గౌరవం చోటుచేసుకున్నాయి.
ఘర్షణ వైఖరిని తగ్గించుకుంటున్న ద్రవిడపార్టీలు
తమిళ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ట్రెండ్స్‌ను విశ్లేషిస్తే.. తమిళ ప్రజల ఆలోచనా విధానంలో కూడా గణనీయమైన మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఉచితాలు , సెంటిమెంట్ రాజకీయాల కంటే అభివృద్ధి , మౌలిక వసతుల కే తమిళ యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. చెన్నై మెట్రో విస్తరణ, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, పారిశ్రామిక హబ్‌లకు కేంద్ర నిధులు అత్యంత ఆవశ్యకమని భావిస్తున్న నేపథ్యంలో, అనవసరమైన రాజకీయ ద్వేషం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందనే అభిప్రాయం తమిళ నెటిజన్లలో వ్యక్తమవుతోంది. తమిళనాడు రాజకీయ రంగాన కొత్తగా ఆవిర్భవించిన పొలిటికల్ శక్తులు , మారిన ద్రవిడ కూటముల వ్యూహాలు కూడా ఈ మార్పునకు కారణమయ్యాయి. బీజేపీపై కేవలం రొటీన్ ఆరోపణలతో ఇకపై ఓటు బ్యాంకును నిలబెట్టుకోలేమని గ్రహించిన ప్రధాన ద్రవిడ పార్టీలు, వ్యూహాత్మకంగా తమ ఘర్షణ వైఖరిని తగ్గించుకున్నాయి.
అనవసర ద్వేషం అవసరం లేదనుకుంటున్న విజయ్
ప్రధాని మోదీ సైతం తన ప్రసంగాల్లో తిరుక్కురళ్ పద్యాలను, తమిళ సంస్కృతి, భారతీయార్ కవితలను నిరంతరం ప్రస్తావిస్తూ తమిళ భాషాభిమానాన్ని ఆకట్టుకునేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాలు కాషాయంపై ఉన్న సైకలాజికల్ భయాన్ని గణనీయంగా తగ్గించాయి. ఈ మార్పు వెనుక ఉన్న మరో ముఖ్యమైన రాజకీయ కోణం.. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు మారుతున్న అవసరాలు. ఒకప్పుడు బీజేపీని అంటరాని పార్టీ గా చూసిన ద్రవిడ నేతలు ఇప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు నెరపడం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి నిధులు తెచ్చుకోగలమని భావిస్తున్నారు. అంతేకాకుండా, క్షేత్రస్థాయిలో బీజేపీ వేగంగా పుంజుకోవడం, ఓటు బ్యాంకును విస్తరించుకోవడంతో నేరుగా కాషాయ శ్రేణులతో విభేదించడం కంటే రాజకీయ పోటీని ప్రజాసమస్యలపైకి మళ్లించడమే ఉత్తమమని స్థానిక నాయకత్వాలు నిర్ణయించుకున్నాయి.
ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో విజయానికి మార్గంగా ఉన్న కాషాయ వ్యతిరేకత , బీజేపీ ద్వేషం ఇప్పుడు క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోతోంది. నల్ల బెలూన్ల స్థానంలో అభివృద్ధి భాగస్వామ్యానికి ప్రాధాన్యమిచ్చే నయా రాజకీయ శకం తమిళ నేలలో ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల్లో కేవలం భావోద్వేగాలు, ద్రవిడ సెంటిమెంట్లు మాత్రమే కాకుండా, సంక్షేమం , మౌలిక వసతుల రూపకల్పనే గెలుపోటములను నిర్ణయించే ప్రధాన అంశంగా మారబోతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















