![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Srikakulam Varasulu : సిక్కోలు వైఎస్ఆర్‌సీపీలో వారసుల అలజడి - జగన్ రెడ్ సిగ్నల్ ! సీనియర్లు ఏం చేయబోతున్నారు ?
శ్రీకాకుళం వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు తమ వారసుల్ని రాజకీయ రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం సీనియర్లే పోటీ చేయాలంటున్నారు.
![Srikakulam Varasulu : సిక్కోలు వైఎస్ఆర్‌సీపీలో వారసుల అలజడి - జగన్ రెడ్ సిగ్నల్ ! సీనియర్లు ఏం చేయబోతున్నారు ? Srikakulam YSRCP senior leaders want to bring their descendants into the political arena. Srikakulam Varasulu : సిక్కోలు వైఎస్ఆర్‌సీపీలో వారసుల అలజడి - జగన్ రెడ్ సిగ్నల్ ! సీనియర్లు ఏం చేయబోతున్నారు ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/b33cddb1ac246ad2a16401328e96f6e31672844448341228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Srikakulam Varasulu : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చిత్ర, విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి అధికార పార్టీ సీనియర్లు చేస్తున్న పొంతనలేని ప్రకటనలు, ఆ పార్టీ కేడర్ను అయోమయానికి గురిచేస్తున్నాయి. ముందు ఈ పరిణామాలకు నాంది పలికింది ధర్మాన కృష్ణదాస్. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన తరువాత, తన రాజకీయ జీవితానికి ఇది చాలు అనుకున్నారేమో! అలాగే ధర్మాన కూడా తన వారసుడికి చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ సీతారాం కూడా అదే పనిలో ఉన్నారు. కానీ జగన్ ఎవరికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది.
కుమారుడు కృష్ణ చైతన్య కోసం ధర్మాన కృష్ణదాస్ ప్రయత్నం
అంతకుముందు ఆర్ అండ్ బి మంత్రిగా ఉన్నపుడు చిన్న కుమారుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యను రాజకీయ వారసుడిగా పార్టీ కేడర్ ముందు కృష్ణదాస్ ప్రకటించారు. పోలాకి జడ్పీటీసీగా గెలిపించి లైన్ క్లియర్ చేశారు. ఆ మండలానికే కృష్ణచైతన్య పరిమితం కాలేదు. తండ్రి వారసునిగా నియోజకవర్గమంతా పర్యటిస్తూ, జడ్పీటీసీ కాకముందే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోపాల్గొనేవారు. అంతటితో ఆగిపోలేదు.. తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. కృష్ణదాస్‌ను వ్యతిరేకించే వర్గాన్ని దూరం పెట్టారు. 'ధర్మాన’ కుటుంబాలలో సారవకోట 'చిన్నాల" ది ఒకటి. ధర్మాన సోదరుల తల్లి సావిత్రమ్మ అక్క, చెల్లెళ్లలో 'చిన్నాల' వారి తల్లి ఒకరు. ఎంపీపీ కూర్మినాయుడికి స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు అనుచరులుగా ముద్రపడ్డ వారికి పెద్దగా గుర్తింపు లేకుండా పోయిందట.
నరసన్న పేటలో జోక్యం చేసుకున్న ధర్మాన ప్రసాదరావు వర్గం !
దీంతో ధర్మాన, ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడులు ఏదో ఒక సందర్భంలో నరసన్నపేట నియోజకవర్గంలో అడుగుపెట్టడం వల్ల అక్కడ అధికార పార్టీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తెలిసి కూడా కృష్ణదాస్ తన వారసునిగా చైతన్యను నిర్ణయించారు. చైతన్య బరిలోకి దిగాలని వైఎస్ఆర్‌సీపీ కేడర్ బలంగా కోరుకుంటోంది. ఆ మధ్య ఓ సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడుతూ తానే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవని, ఒకవేళ తానుఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపడతానని ప్రకటించారు. ఇదంతా గందరగోళానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
తాను పోటీ చేయనని చెప్పానని.. కానీ జగన్ చేయమంటున్నారంటున్న ధర్మాన ప్రసాదరావు !
ఇటీవల సంచలన ప్రకటనలు గుప్పిస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా, ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనలేదని, ఉత్తరాంధ్ర కోసం, విశాఖ రాజధాని కోసం సీఎం అనుమతిస్తే, అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రసాదరావు ప్రతీ మాట వెనుక ఓ వ్యూహం ఉంటుంది. ఏ మాట కూడా పొరపాటున పెదవి జారనివ్వరు. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో సంచలన ప్రకటనలు చేస్తున్నది ఆయనే. అమరావతి రైతుల అరసవల్లి పాదయాత్ర ఆగిపోవడానికి ధర్మాన వ్యూహమే కారణమని పరిశీలకుల అభిప్రాయం. ఆయన తనయుడు రామ్ మనోహర్ నాయుడు తండ్రి కోసం, పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. కానీ ప్రసాదరావు ఏనాడూ తన వారసుడని మనోహర్ నాయుడిని ప్రకటించలేదు. ఈసారి ఎన్నికల్లో నాన్నే పోటీ చేయాలని రామ్మనోహర్ నాయుడు కేడర్ దగ్గర చెబుతున్నారు. కానీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని ధర్మాన ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో కూడా పోటీ చేయడం ఇష్టం లేదనడం కొడుకు కోసమా అనే చర్చ మొదలైంది. కానీ, సీఎం జగన్ మాత్రం ఈ సారికి ధర్మానే పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కుమారుడికి అముదాల వలస టిక్కెట్ కోరుతున్న స్పీకర్ సీతారాం !
స్పీకర్ తమ్మినేని సీతారాంనకు కూడా సీఎం జగన్ ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే, సీతారాం పరోక్షంగా కేడర్కు సంకేతాలిచ్చినా, కొడుకు చిరంజీవినాగ్ వారసుడిగా దింపాలని నిర్ణయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కొందరు వ్యతిరేక వర్గీయులు సీతారాం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం నరసన్నపేటలో నెలకొన్న పరిస్థితులే ఆమదాలవలసలోనూ ఉన్నాయి. సీఎం జగన్‌కు గెలుపు గుర్రాలు తప్ప ఓడిపోయే వారసుల పట్ల ఆసక్తి లేదట. ఓడిపోయేవాళ్లను తప్పించి, కొత్తవారికి టిక్కెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇదే జరిగితే, కొడుకుల కోసం తప్పించే తండ్రులకు పరాజయమేకాదు, పరాభవం కూడా తప్పదంటున్నారు పరిశీలకులు.
అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎ ఒక్క వారసులకీ చాన్సివ్వడం లేదని.. మళ్లీ అందరు సీనియర్లే పోటీ చేయాలని అంటున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా అనుభవ లేని వారికి చాన్సిచ్చి రిస్క్ తీసుకోలేమని ఆయన అనుకుంటున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)