(Source: ECI/ABP News/ABP Majha)
Revant On Venkatreddy : కోమటిరెడ్డికు రేవంత్ వివరణ - తామంతా ఒకటేనన్న టీ పీసీసీ చీఫ్ !
కోమటిరెడ్డి వెంకట రెడ్డి తమ కుటుంబ సభ్యుడేనని రేవంత్ అన్నారు. క్షమాపణ చెప్పాలన్న కోమటిరెడ్డి డిమాండ్‌పై రేవంత్ స్పందించారు.
Revant On Venkatreddy : కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు తనను కూడా బ్రాందీ షాపుల్లో పని చేసుకునేవారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారని ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలన్న వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేరే.. రాజగోపాల్‌రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని రేవంత్ ప్రకటించారు. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి అన్నారు. వెంకట్ రెడ్డికి వివరణ ఇస్తున్నా.. రాజగోపాల్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబంధంలేదు.. వెంకన్న మా వాడేనని ప్రకటించారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ తనను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నా.. పార్టీ వీడిపోయే వరకూ రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనూ రేవంత్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన విషయంలో తన వైపు తప్పు లేకుండా చూసుకుంటున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం
అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వెంకటరెడ్డి తమతో టచ్‌లో ఉన్నాడని నేరుగా తెలంగామ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బండి సంజయ్‌ను వెంకటరెడ్డి పల్లెత్తు మాట అనకపోగా.. పార్టీ మారుతారా అని అడుగుతూంటే.. ఖండించేందుకు కూడా సిద్ధపడటం లేదు. ఈ అంశం ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తాము పుట్టిందే కాంగ్రెస్‌లో అని చెబుతున్నారు కానీ పార్టీని వీడబోమని చెప్పడం లేదు. ఈ అంశమే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్‌లో అనేక సందేహాలకు కారణం అవుతోంది.
పార్టీలో చేరికల్ని వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో చేరికలపై కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు కాంగ్రెస్ లో చేరడాన్ని ఆయన వ్యతిరేకించారు. వారిపై కేసులున్నాయని..ఇతర కారణాలు చెప్పారు. తాజాగా తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. మునుగోడులో పార్టీ బలం పెరగడానికి చెరుకు సుధాకర్ కీలకమని.. ఒక వేళ ఉపఎన్నిక వస్తే అభ్యర్థిగా కూడా పరిశీలించవచ్చన్న ఉద్దేశంతో రేవంత్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఆయనను చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.
విమర్శలు చేస్తున్నా కోమటిరెడ్డిపై పొలైట్‌గా స్పందిస్తున్న రేవంత్
చేరికలపై అడ్డు పడవద్దని హైకమాండ్ గతంలో పార్టీ నేతలకు సూచించింది. అయితే కోమటిరెడ్డి చేరికలకు వ్యతిరేకంగానేఉన్నారు. ఒకరు పార్టీ నుంచి వెళ్లిపోయి.. మరొకరు పార్టీలోనే ఉండి తనను టార్గె్ట చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఆవేశపడటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ వాడేనని ఆయన అంటున్నారు. ఓ వైపు కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూంటే రేవంత్ మాత్రం చాలా సామరస్యగా స్పందిస్తూడటంతో ఈ విషయంలో రేవంత్‌కే సపోర్ట్ లభిస్తోంది.