Gadikota Srikanth Reddy : జగన్‌కు షాక్ ఇవ్వబోతున్న మరో కట్టప్ప- వైసీపీకి రాజీనామా చేయనున్న గడికోట శ్రీకాంత్!
Gadikota Srikanth Reddy : వైసీపీకీ రాయచోటి ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. పార్టీలో గుర్తింపు లేదని రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం నడుస్తోంది.
Rayachoty MLA Gadikota Srikanth Reddy: వైసీపీ(YSRCP)లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ మనుషులుగా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి(Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) పార్టీని వీడారు. ఇప్పుడు అదే బాటలో మరో ఎమ్మెల్యే(MLA) జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
శ్రీకాంత్ జంప్
రాయచోటి(Rayachoty) ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి(Gadikota Srikanth Reddy) వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP)కి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కాలంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. చీఫ్ విప్‌గా పదవిలో ప్రస్తుతం ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ వేదికలపై ఎక్కడా కనిపించడం లేదు.
సన్నిహితులకు సమాచారం
గడికోట శ్రీకాంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉందని అందుకే ఆయన స్థానంలో ఓ ఐఏఎస్‌ను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదనకు కూడా బ్రేక్ పడింది. ఈ సీటుపై చర్చలు కొనసాగుతున్న టైంలో గడికోట శ్రీకాంత్ రాజీనామాపై నిర్ణయం తీసేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన
గడికోట శ్రీకాంత్ శ్రేయోభిలాషులతో మాట్లాడిన ఏబీపీ దేశం... ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుంది. పార్టీలో ఉండటం కష్టంగా ఉందని కనీస గౌరవం కూడా లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇక చేసిన సేవలు చాలని మూవ్ ఆన్ అవ్వడమే మంచిదనే భావనలో శ్రీకాంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి సైలెన్స్
తన మనసులో మాట ఫోన్‌లో చెప్పిన శ్రీకాంత్... ప్రస్తుతం ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు. సన్నిహితులు ఎన్ని విధాలుగా అడిగినా త్వరలోనే అన్నింటికీ సమాధానం చెబుతానని ప్రస్తుతానికి తాను ఎక్కడ ఉన్నానో అన్నది మాత్రం అప్రస్తుతం అని ఫోన్ పెట్టేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో వెళ్లేందుకు రెడీ
గడికోట శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఫీల్డ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని వెనుక ఓ కీలకమైన వ్యక్తి ఉన్నట్టు సమాచారం. ఆర్కేతోపాటు శ్రీకాంత్ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు షర్మిలతో కూడా మంతనాలు జరిపినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతానికి శ్రీకాంత్‌తో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నా ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదట.
జగన్ అండతో ఎదుగుదల
వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేని కాంగ్రెస్ పార్టీలోకి ఇలాంటి సీనియర్ నేతలు ఎందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల టైంలో ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయని అంటున్నారు. ఆయనకు రాజకీయ అవకాశాలు కల్పించింది జగనే అంటున్నారు.
ఖండిస్తున్న వైసీపీ
జగన్ రికమండేషన్‌తోనే కాంగ్రెస్‌లో శ్రీకాంత్ ఒక్కో మెట్టు ఎక్కారని వైసీపీ నేతలు అంటున్నారు. చివరకు శ్రీకాంత్ డిమాండ్ మేరకే రాజంపేట కాదని రాయచోటిని జిల్లాను చేశారని అంటున్నారు. ఆయన రాజకీయ ఎదుగుదలలో జగన్ ప్రమేయం అడుగడుగునా ఉందని విశ్లేషిస్తున్నారు. అలాంటి వ్యక్తి పార్టీ మారడం అనేది ఉండకపోవచ్చని అంటున్నారు.
ఎక్కడ మొదలయ్యారో అక్కడికే
గడికోట శ్రీకాంత్ రెడ్డి 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాయచోటి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. 2019 నుంచి చీఫ్ విప్‌గా ఉన్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు. గడికోట శ్రీకాంత్ తండ్రి గడికోట మోహన్ రెడ్డి అప్పటి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2012లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఇప్పుడు మళ్లీ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.