Polavaram Politics : పోలవరం కోసం రాజీనామాలు - ఏపీలో కొత్త రాజకీయ సవాళ్లు !
పోలవరం కోసం రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఎప్పుడు రాజీనామాలు చేయాలో తమకు తెలుసని వారంటున్నారు.

Polavaram Politics : ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం కేంద్రంగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి .. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ. ఇరవై వేల కోట్లు కావాలని కేంద్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంపై యుద్ధం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోలవరం కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి వైఎస్ఆర్‌సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
పోలవరం కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ !
పోలవరం ముంపు గ్రామాల్లో .. విలీన మండలాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచారని ఆరోపిస్తున్నారు. సాఫీగా సాగిపోయే ప్రాజెక్ట్ జగన్ నిర్వాకం వల్ల ఆగిపోయే పరిస్థితి వచ్చిందని.. కనీసం సహాయ, పునరావాసానికి నిధులు తెచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. కేంద్రంపై యుద్ధం చేస్తున్నామన్న జగన్ మాటలను గుర్తు చేస్తూ.. కేంద్రంపై వైసీపీ చేస్తున్న యుద్ధంలో భాగంగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని..అలా అయితేనే కేంద్రం నిధులు ఇస్తుందన్న ఓ వాదనను టీడీపీ తెరపైకి తీసుకు వచ్చింది. పోలవరం ఏపీ జీవనాడి. ఈ జీవనాడి గత మూడేళ్ల నుంచి మూలన పడింది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు. నిర్వాసితులు నష్టపోతున్నారు. అందుకే తక్షణం ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.
రాజీనామాలు ఎప్పుడు చేయాలో మాకు తెలుసన్న వైఎస్ఆర్‌సీపీ !
పోలవరం కోసం ఎప్పుడు రాజీనామాలు చేయాలో తమకు, జగన్ కు తెలుసని.. చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు ఉచిత సలహాలు మాని మీ పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులచే రాజీనామా చేయించాలి’’ అని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేయించి వైసీపీ ద్వారా గెలిపించిన చరిత్ర జగన్‌ది అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేను కాదు కదా సమస్యపై సర్పంచ్‌ను కూడా రాజీనామాను చేయించని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలంటే పారిపోయే చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వడం హాస్యస్పదమంటూ కొడాలి నాని విమర్శలు చేశారు.
గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామాల డిమాండ్.. ఇప్పుడు పోలవరం కూడా !
గతంలో ప్రత్యేకహోదా కోసం రాజీనామాల డిమాండ్ వినిపించేది. ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేకహోదా రాదో చూద్దామని జగన్ చెప్పేవారు. ఎంపీలతో రాజీనామా చేయించారు. కానీ ఆరు నెలలపదవీ కాలం ఉన్నప్పుడే రాజీనామాలు చేయించడంతో ఉపఎన్నికలు రాలేదు. ఇప్పుడు పోలవరం అంశంపై రాజీనామాల డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ ఎంపీలు.. వైసీపీ ఎంపీలురాజీనామా చేస్తే తాము కూడా చేస్తామని అంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం కేంద్రం భరించాలి. కానీ ఈ విషయంలో కేంద్రంఅంత వేగంగా స్పందించడం లేదని ముఖ్యమంత్రే చెబుతున్నారు. మరి టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా రాజీనామాల సవాళ్లను ముందుకు తీసుకెళ్తారా లేకపోతే... ఎదురుదాడి మార్గమే ఎంచుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీని టీడీపీ కార్నర్ చేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

