PM Modi: ప్రజాగళం సభకు హాజరైన ప్రధాని - 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
PM Modi attends Prajagalam Meeting: చిలకలూరిపేటలో జరుగుతున్న ప్రజాగళం సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
Prajagalam Meeting in Chilakaluripet: చిలకలూరిపేట: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్‌లో చిలకలూరిపేట (Chilakaluripet)లో నిర్వహిస్తున్న సభా ప్రాంగాణానికి చేరుకున్నారు. 10 ఏళ్ల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకు రానున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మరోసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాలు పూర్తి చేసుకోగా, 3 పార్టీల పొత్తు అనంతరం తొలి ఉమ్మడి బహిరంగ సభను పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో 'ప్రజాగళం' పేరిట నిర్వహిస్తున్నారు.
ప్రజాగళం సభలో మోదీకి ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పక్కన పవన్ కళ్యాణ్ కూర్చోగా.. మోదీకి మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూర్చుకున్నారు. ఈ సభకు టీడీపీ, బీజేపీ, జనసేన కీలక నేతలతో పాటు 3 పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి.
ప్రధాని ప్రసంగంపై ఏపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామని.. ప్రజాగళం సభ కోసం ఏపీకి వస్తున్నా అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'చంద్రబాబు, పవన్ తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా. ఎన్డీయేకు ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.