Khammam Politics: రేగాకు షాక్! సొంత మండలం జడ్పీటీసీ రాజీనామా, ఆచితూచి జంప్ అవుతున్న నేతలు
Khammam Politics: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ధిక్కార స్వరం వినిపించిన రెండు రోజులకే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండలానికి చెందిన జడ్పీటీసీ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దిక్కార స్వరం వినిపించిన రెండు రోజులకే ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత మండలానికి చెందిన జడ్పీటీసీ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీలో గత మూడేళ్లుగా వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అయితే అధికార పార్టీని ఎదిరించి బయటకు రాలేని కొందరు ఇన్ని రోజులు స్తబ్ధుగా ఉండి ఎన్నికలకు ఏడాది ఉండటంతో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గత మూడేళ్ల నుంచి స్తబ్ధుగా ఉన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇప్పటికే పార్టీ మారతానని అల్టిమేటం జారీ చేశారు. ఇదిలా ఉండగా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సొంత మండలమైన కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు తన రాజీనామా చేయడంతోపాటు అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు ప్రకటించడం గమనార్హం. పార్టీలో వర్గాలు కారణంగా తమకు ప్రాధాన్యం లేదని, అందువల్లే తాను పార్టీ వీడేందుకు సిద్దమయ్యానని రాజీనామా సందర్భంగా ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడు పినపాక నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారి తీస్తోంది.
కారు పుల్ కావడంతోనే ఆచితూచి జంప్ జిలానీలు..
గులాబీ పార్టీలో గత మూడేళ్ల కాలం నుంచి వలసలు జోరు పెరిగింది. ఇతర పార్టీలకు చెందిన వారు కొందరు స్వతాహాగా పార్టీలో చేరగా బలమైన క్షేత్రస్థాయి నాయకులను బెదిరింపులు, బేరసారాలు, బుజ్జగింపులతో గులాబీ కండువాలు కప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రతి చోట నాయకుల మద్య వర్గపోరు మొదలైంది. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎవరికి ప్రాదాన్యం ఇస్తే వారి హవానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలను ఎదిరించి బయటకు వేళ్లలేక స్థబ్ధుగా ఉన్న నాయకులు ఇప్పుడు వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
అంచనాలు వేస్తున్న నాయకులు..
మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇంకా ఎంత మంది పార్టీని వీడతారోనని అధికార పార్టీ నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాధాన్యత లేకుండా అసంతృప్తిగా ఉన్నారనే విషయంతోపాటు వారు ఎవరితో టచ్‌లో ఉంటున్నారనే విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇంటి పోరు లేకుండా జాగ్రత్త తీసుకోవడంతోపాటు బలమైన నాయకులు పార్టీని వీడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ గులాబీలో గత కొంత కాలంగా పెరిగిన వలసల జోరు ఇప్పుడు అదే ఇతర పార్టీలకు వలసలు పోవడానికి కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎంత మంది పార్టీని వీడతారో? వేచి చూడాల్సిందే.