(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: 'మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా' - మమ్మల్ని తొక్కుతామంటే తామూ తొక్కుతామని పవన్ కల్యాణ్ హెచ్చరిక
Andhra Politics: తాను ప్రాణాలు తెగించి ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారం కోసం కాదని.. మార్పు కోసమే పని చేస్తున్నట్లు వెల్లడించారు.
Pawan Kalyan Comments in Janasena Foundation Meeting: వైసీపీ, సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని.. కానీ మమ్మల్ని తొక్కేస్తామంటే తామూ తొక్కేస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలోని (Mangalagiri) జనసేన కార్యాలయంలో గురువారం జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. 'జనసేన పార్టీని 150 మందితో ప్రారంభించాం. నేడు 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఓ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చిన నేను 2019 ఎన్నికల్లో ఓడిపోతే శూన్యంగా అనిపించింది. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడి పోరాడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చాను. ఇంకెవరూ బతక్కూడదు. మా గుంపే బతకాలనుకునే ధోరణి మారాలి. కుటుంబంలోని ఓ వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడతారని చాలామంది భయపెట్టారు. చట్టాలు అందరూ చెప్తారు. కానీ ఎవరూ పాటించరు. ఓ నటుడిగా, ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా నాకు ప్రపంచమంతా తెలుసు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు నావే అనుకుని పని చేస్తున్నా. తగ్గే కొద్దీ ఇంకా ఎదుగుతాం. నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో వారి ఊహకే వదిలేస్తున్నా. అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నామంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. శ్రీలంక ప్రజలు అధ్యక్షుడి భవనాన్ని ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. అలాగే, తాడేపల్లి ప్యాలెస్ ను కూడా వాడుకుంటారు. దేశ అధ్యక్షుడికి పట్టిన గతి ఓ సీఎంకు జరగదని గ్యారంటీ ఉందా.?. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్రా - తెలంగాణలో సరిహద్దులో చూశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుంది.' అని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు.
'నాకు అది ముందే తెలుసు'
'పొత్తుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ఏం జరుగుతుందో నాకు పూర్తిగా అర్థమైంది. పెద్ద మనసు చేసుకుంటే చిన్నపోవాల్సి వచ్చింది. పొత్తుల వల్ల మా అన్న నాగబాబు సైతం టికెట్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. టికెట్లు రాని వాళ్లు నన్ను తిడతారు. వ్యక్తిగతంగా నన్ను తిట్టినా పర్వాలేదు. అయితే, పొత్తుకు ఇబ్బంది కలిగితే కచ్చితంగా చర్యలు ఉంటాయి. 2019లో 30 స్థానాల్లో పోటీ చేయాలని భావించాను. నేను ఓడిపోతున్నా అని కూడా నాకు తెలుసు. భీమవరంలో కూడా ఓడిపోతానని ప్రచారం ముగిసిన వెంటనే తెలిసింది. గాజువాకలోనూ ఓడిపోతానని తెలిసినా.. అన్నీ తట్టుకుని ప్రజల కోసం నిలబడ్డాను.' అంటూ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీపై సెటైర్లు
సీఎం జగన్ 'సిద్ధం' చివరి సభలో గ్రాఫిక్స్ వాడారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. రాజకీయ సభల్లో గ్రాఫిక్స్ వాడడం వారికి అలవాటేనని పవన్ ఎద్దేవా చేశారు. 'వైసీపీ నేతల్లాగా మేము గ్రాఫిక్స్ వాడం. నా సినిమాల్లోనే గ్రాఫిక్స్ వాడడానికి ఒప్పుకోను. సిద్ధం సభకు 15 లక్షల మంది వచ్చారని డబ్బా కొట్టుకుంటున్నారు. ఆ సభలో గ్రాఫిక్స్ వాడి మరోసారి వైసీపీ నేతలు అభాసుపాలయ్యారు. ప్రజలను ఏడిపిస్తోన్న వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.' అని పవన్ పేర్కొన్నారు.
పిఠాపురం నుంచే ఎందుకు.?
అయితే, ఈ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గురువారం పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఎంపిగా పోటీ చేయడంపై ఆయన ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అయితే, పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రతిసారీ ఎన్నికల్లో భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఈ స్థానంలో పోటీ చేసిన ఏ నేత కూడా వరుసగా రెండోసారి విజయం సాధించలేదు. ఇక్కడ 90 వేల మందికి పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండగా.. బీసీల ఓట్లు సైతం అధికంగానే ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీకి సిద్ధం అయ్యారని తెలుస్తోంది.