Oppositions failures : ప్రజావ్యతిరేక నిర్ణయాల్లో ప్రభుత్వాల దూకుడు - విపక్షాలు ప్రజల కోసం పోరాడలేకపోతున్నాయా ?
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలపై విపక్షాలు సరైన రీతిలో పోరాడలేకపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. వ్యక్తిగత సమస్యలపై విపక్షాలు రోడ్డెక్కుతున్నాయి కానీ ప్రజాసమస్యలపై స్పందించడం లేదు.
Oppositions failures : అధికారం ఉంటేనే ప్రజలు గుర్తుంటారా ? లేకపోతే పట్టించుకోరా ? ఇప్పుడిదే ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలు. సడెన్ గా ఈ అనుమానాలు రాలేదు. గతకొంతకాలంగా ఈ ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఇప్పుడు మాత్రం తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. ఎందుకలా అంటే అటు బీజేపీ ప్రభుత్వమే కాదు ఇటు విపక్షాలు కూడా పూర్తిస్థాయిలో విఫలమయ్యాయి.
సామాన్యుడి జీవనాన్ని భారం చేస్తున్న విపక్షాలు!
ఒకప్పుడు విపక్షాలంటే అధికాపార్టీకి భయంగా ఉండేది. ఏ చట్టాన్ని తేవాలన్నా..ఏ జీవోని అమలు చేయాలన్నా..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆచితూచి అడుగువేసేది. నా ఇష్టం..నేను చెప్పిందే వేదం అన్న లెవల్లో అధికారపార్టీ తీరు ఉంటే దానికి ధీటుగా జవాబిచ్చేది ప్రతిపక్షం. అలా గ్యాస్, పెట్రోల్ , నిత్యావసర ధరలు ఇలా ఏది పెరిగినా నిరసలతో హోరెత్తించేది. ధర్నాలు, ర్యాలీలంటూ ప్రజలను ఉత్తేజపరచడమే కాదు అధికారపార్టీని కూడా తిగివచ్చేలా చేసేది. అంతటి పోరాటం ఆనాడు ప్రతిపక్షాల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏందయ్యా అంటే నిద్రావస్థలో ఉన్నారు.
ఓ వైపు మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. కొన్నింటిపై ప్రజల్లో మద్దతు ఉన్నా సామాన్యుడి విషయంలో మాత్రం కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అసహనాన్ని పెంచేస్తున్నాయి. జీఎస్టీ పేరుతో తినే తిండి నుంచి చివరకు తుడుచుకునే టిష్యూ పేపర్ వరకు ప్రతీదానిపై పన్నులేస్తూ పన్నుపోటుతో సామాన్యుడికి గుండెపోటు వచ్చేలా చేస్తోంది.
ప్రభుత్వాలపై పోరాటంలో విపక్షాల ఆత్మరక్షణ ధోరణి !
ఏ రోజు ఇంధన ధరలు ఎలా ఉంటాయో తెలియదు. ఏ రోజు ఏ బ్యాంకు ఉంటుందో దేనిలో విలీనం అవుతుందో తెలియదు.. చివరకు సామాన్యుడు రోడ్డు మీద ఉండాలన్నా ఎలాంటి పన్నులు వేస్తుందో అర్ధం కావడం లేదు. తినాలన్నా..తాగలన్నా..దేశంలో ఉండాలన్న అసలు బతుకంటేనే సామాన్యుడికి విరక్తి కలిగేలా బీజేపీ పాలనా నిర్ణయాలు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పోరాటాలు చేయాల్సిన విపక్షాలు ప్రజలను వదిలేశాయి. మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి మీ చావు మీరు చావండి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
వ్యక్తిగత సమస్యలపై బీజేపీతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ !
బీజేపీని ఇరుకున పెట్టి..తిరిగి అధికారాన్ని అందుకోవాలన్న ఆలోచన లేని కాంగ్రెస్ ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత సమస్యలపై మోదీతో పోరాటం చేస్తోంది. ఈడీ విచారణకు సోనియా, రాహుల్ హాజరవుతున్నారని పార్టీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నాయి. దీనికి ప్రజల మద్దతు కావాలని కోరడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఇప్పటివరకు మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు, దేశం ఎలా నష్టపోతోందో వివరంగా కాంగ్రెస్ చెప్పలేకపోయిందని విమర్శిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు పోరాడుతున్నాయా?
కేంద్రంలోనే కాదు చివరకు తెలుగురాష్ట్రాల్లోనూ విపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. అసలు ప్రజలు విపక్షాలు ఉన్నాయా అన్న అనుమానాలకు వచ్చేశారు. చంద్రబాబుని తిట్టారు..వారి కుటుంబసభ్యులను అవమానించారు..అన్న బాధతో టిడిపి శ్రేణులు ధర్నాలు..రాస్తారోకోలు చేశాయే కానీ జగన్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలని కలుపుకు పోయారా అంటే అదీ లేదు. నామ్ కే వాస్తే అన్నట్లు టీవీ ఛానెళ్లలో కూర్చొని వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలను ఎత్తి చూపింది లేదు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్, బీజేపీలు కుటుంబపాలనంటూ కెసిఆర్ ఆయన కొడుకు, కూతురు పదవులు..పంపకాల గురించి మాట్లాడుతున్నారే కానీ ప్రభుత్వం ఏ ఏ విషయాల్లో వైఫల్యం చెందింది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారన్నది రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం.
ఓటర్లు అన్నీ తెలుసుకుంటున్నారా ?
అయితే కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత జానారెడ్డి పూర్వాశ్రమంలో అన్నట్లు ప్రజలకు అధికారపార్టీ మీద విరక్తిపుడితే కాంగ్రెస్ కే ఓటేస్తారు అని అన్నారు. కానీ ప్రజలు కూడా ఓవర్ స్మార్ట్ అయినా విషయం ఈ ఓల్డ్ పొలిటిషయన్ తెలియదేమో అని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు..దేశంలో విపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని తేల్చేశారు. అయితే ఈ వాదనను విపక్షాలు ఖండిస్తున్నాయి. ప్రజలకు అన్నీ తెలుసునని రానున్న ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలన్నది కూడా వాళ్లు డిసైడ్ ఉన్నారని అంటున్నారు. ఒకప్పుడు మీడియా అంతగా లేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏ పార్టీ ఏ నేత ఎలాంటి వారన్నది ఓటర్లకు పూర్తి అవగాహన ఉందంటున్నారు.