Telangana Money Politics : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు - కోట్ల నగదుతో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు
హైదరాబాద్‌లో ఆపరేషన్ ఆకర్ష్ విఫలమయింది. నలుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.
Telangana Money Politics : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. నలుగురు నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు .. పార్టీ ఫిరాయింపుల కోసం బేరసారాలుడుతూ దొరికిపోయారు. పక్కా సమాచారం ఉండటంతో పోలీసులు హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఓ ప్రముఖుడి ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. పోలీసులు దాడుల్లో రూ. 15కోట్ల వరకూ నగదు పట్టుబడింది. ఢిల్లీ నుంచి వచ్ిచన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులతో..నలుగురు ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు.. పోలీసుల దాడులు
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షనర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఫామ్ హౌస్‌లో వీరితో మాట్లాడుతూండగా పోలీసులు దాడి చేశారు. తర్వాత వారు అక్కడ్నుంచి వెళ్లిపోాయరు. ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారన్నదానిపై వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి ఢిల్లీకి చెందిన ఓ పీఠాధిపతిగా భావిస్తున్నారు. సింహయాజులు కూడా స్వామజీ వేషధారణలో ఉన్నారు. నందకుమార్.. అంబర్ పేటకు చెందిన ఓ జాతీయ పార్టీ నేత. అయన డెక్కన్ ప్రైడ్ హోటల్ ఓనర్‌గా చిరపరిచితులు. నందకుమార్ మధ్యవర్తిగా.. నలుగుురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కోసం బేరం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ. వంద కోట్లు ఇచ్చేలా బేరం మాట్లాడుకుంటున్నారని చెబుతున్నారు.
రూ. 15 కోట్ల వరకూ నగదు పట్టుబడినట్లుగా ప్రచారం
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలకు ముందు భారీ కుట్ర చేస్తున్నారన్న సమాచారం రావడతో పోలీసులు నిఘా పెట్టి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్‌లో బేరసారాలాడుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫాయించిన వారే. టీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు... ఈ చర్చల్లో ఉన్నారు. పోలీసులు దాడి చేయడంతో నలుగురు ఎమ్మెల్యేలు తర్వాత వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికిసంబంధించిన వీడియోలు స్పష్టంగా ఉన్నాయి.
ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే రైడ్ చేశామన్న సైబరాబాద్ కమిషనర్
డబ్బులతో పట్టుబడిన ముగ్గురూ ఓ జాతీయ పార్టీ నేతలకు సన్నిహితులని చెబుతున్నారు. నందకుమార్ ఓ కేంద్ర మంత్రి కి సన్నిహితుడని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి.. ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. పార్టీఫిరాయిస్తే పదవులు, డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసులు చెబుతున్నారు. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా దాడులు చేశామని.. పోలీసులు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారని .. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. చట్టపరమైన చర్యలు తీసుకుటామన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్‌లో ఉంటారని.. తిరుపతి నుంచి కూడా ఓ స్వామిజీ వచ్చారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీరంతా ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారన్నారు. ఏమని ప్రలోభ పెట్టారన్న దానిపై విచారణ జరుపుతున్నామన్నారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ మరో ఐదు రోజుల్లో జరగనున్న సమయంలో వెలుగు చూసిన ఈ ఘటన రాజకీయంగా పెను సంచలనానికి కారణం అవుతోంది.