1000 Days Jagan Ruling : సీఎంగా జగన్ పాలనకు వెయ్యి రోజులు ! ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుస్తోందా ?
సీఎం జగన్ పాలనకు నేటితో వెయ్యి రోజులు పూర్తయింది. భారీ మెజార్టీతో అధికారం దక్కించుకున్న జగన్ వారిఆశలను నెరవేరుస్తున్నారా ? ప్రజాభీష్టం ప్రకారం పరిపాలిస్తున్నారా ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నేటికి వెయ్యి రోజులయింది. అయితే ఈ ఉత్సాహం వైఎస్ఆర్‌సీపీలో కనిపించడం లేదు. ఆ పార్టీ అనుబంధ విభాగాలకు ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తేనే అందరికీ తెలిసింది. వెయ్యి రోజులంటే అరవై శాతం తన పరిపాలనా సమయం ముగిసింది. వెయ్యి రోజుల్లో జగన్ పాలన ఎలా సాగింది ?
సంక్షేమ పథకాలతో లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు !
రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన ప్లస్ పాయింట్లలో ఒకటి నుంచి వంద వరకు చెప్పుకోవాల్సింది నగదు బదిలీ పథకాల గురించే. మేనిఫెస్టో ప్రకారం ఒక్కో కుటుంబానికి ఏటా రూ. రెండు లక్షలకుపైగానే లబ్ది కలిగిస్తామని జగన్ లెక్క చెప్పారు. ఆ ప్రకారం ఆయన చేయడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినా అప్పుల కోసం తీవ్రంగా శ్రమించి పథకాలు అమలు చేస్తున్నారు. ఆదాయం కోసం... మద్యం విధానాన్ని మార్చడంతో పాటు.. వివిధరకాల పన్నులు పెంచడం, అప్పుల కోసం క్రియేటివిటీగా ఆలోచించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వంటివి చేశారు. ఇన్ని చేసినా ఈ ఏడాది అమ్మఒడి ఇవ్వలేకపోయారు. అటెండెన్స్‌కు లింక్ పెట్టి ఇస్తామని జూన్‌కు మార్చారు. మామూలుగా అయితే జనవరిలో ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని సగం మందికిపైగా లబ్దిదారుల వద్ద వాలంటీర్లు అంగీకార పత్రాలు కూడా తీసుకున్నారు. కానీ నేరుగా చెప్పకపోయినా ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది.
అభివృద్ధి పనులు అంతంత మాత్రమే !
వెయ్యి రోజుల కాలంలో ఏపీలో జరిగిన అభివృద్ధి పనులు అంతంత మాత్రమే. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగాహనే ఉద్దానం వెళ్లి ఓ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వెయ్యి రోజులయినా ఆ ఆస్పత్రి పునాదులు కూడా పూర్తి కాలేదు. అది ఉదాహరణ మాత్రమే... రాష్ట్రంలో అన్ని అభివృద్ది పనులూ అంతే. గత ప్రభుత్వం చేపట్టినవన్నీ ఎక్కడవక్కడ ఆపేశారు. రోడ్ల మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి. పోలవరం కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ప్రతి నెలా ఐదారు వేల కోట్లు అప్పు పుట్టించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వద్ద ఉంది. చివరికి ప్రభుత్వ పార్కులు, మార్కెట్లు... క్వార్టర్స్ ఏమైనా ఉంటే తాకట్టు పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని మంత్రులే నేరుగా చెబుతున్నారు.
కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు !
వెయ్యి రోజుల కాలంలో ప్రభుత్వం హైకోర్టు వద్ద నుంచి తిన్న ఎదురు దెబ్బలకు లెక్క లేదు. అదే సమయంలో వెనక్కి తీసుకున్న నిర్ణయాలపైనా లెక్కలేయడం కష్టం. అత్యంత కీలకమైన మూడు రాజధానుల బిల్లు, శాసనమండలి రద్దు బిల్లులను కూడా వెనక్కి తీసుకున్నారు. వెయ్యి రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, ఇంగ్లిష్ మీడియం, ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను తొలగించడం..ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ ఒక్క నిర్ణయమూ అమలు చేసిన పరిస్థితులు కనిపించలేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న రెండు వందల నిర్ణయాల వరకూ కోర్టులు ప్రశ్నించాయి.. కొట్టి వేశాయి. ఇప్పుడు తమంతట తాము తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. అంటే... మెథడ్ ఏదైనా.. వెనక్కి పోవడమే . అందుకే రివర్స్ పాలన అన్న విమర్శలు వస్తున్నాయి.
రివ్యూ చేసుకోవాల్సిన సమయం !
ఏపీ ప్రభుత్వానికి వెయ్యి రోజులు నిండాయి. మహా అయితే ఇంకో ఆరు వందల రోజులు మాత్రమే పాలనకు సమయం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేసుకోవాల్సింది సమీక్ష. తమ పాలనా వైఫల్యాలను .. ప్రజలను అసంతృప్తి గురి చేస్తున్న అంశాలను గుర్తించి తక్షణం సరి చేసుకోవాలి. పార్టీ నేతలు తమ సీఎం ప్రపంచానికి ఆదర్శంగా పాలన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ప్రజల నుంచి వచ్చేదే అసలైన అభిప్రాయం. అది తెలుసుకుని రివ్యూ చేసుకుంటే ప్రజారంజక పాలన అందివవచ్చు.