Rahul Bharat Jodo Yatra : అమరావతికే రాహుల్ గాంధీ సపోర్ట్ - ఏపీలో కోలాహలంగా తొలి రోజు జోడో యాత్ర !
ఏపీలో తొలి రోజు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా సాగింది. రాహుల్‌ను అమరావతి రైతులు, పోలవరం నిర్వాసితులు కలిశారు.
![Rahul Bharat Jodo Yatra : అమరావతికే రాహుల్ గాంధీ సపోర్ట్ - ఏపీలో కోలాహలంగా తొలి రోజు జోడో యాత్ర ! On the first day in AP, Rahul Gandhi's Jodo Yatra went on enthusiastically. Rahul Bharat Jodo Yatra : అమరావతికే రాహుల్ గాంధీ సపోర్ట్ - ఏపీలో కోలాహలంగా తొలి రోజు జోడో యాత్ర !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/e5a6217c3d1790ce67bf2709b89b5cb61666102870060228_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Bharat Jodo Yatra : ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్నూలు జిల్లాలో గట్టి బందోబస్తు నడుమ సాగింది. ఆలూరు నియోజకవర్గం హాలహర్వి బస్టాండ్ వద్ద ఉదయం 7.05కు ప్రారంభం అయింది. కురవల్లి మీదుగా సాగుతూ అగ్రహారం శిబిరం వద్దకు 9 గంటలకు చేరుకుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమై.. ఆలూరు, హులేబీడు మీదుగా మనేకుర్తి వరకు సాగింది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యనాయకులు, యాత్రీకులు చాగి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో రాత్రికి బస చేశారు. యాత్రకు ముందుగా యువకుల బ్యాండ్ పరేడ్ ఆకట్టుకుంది. భారీ జనసందోహం మధ్య, డప్పుల చప్పుళ్ళతో యాత్ర సాగింది. ప్రజలు అడుడగుగునా స్వాగతం పలికారు. యాత్రలో రా ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్, ఏఐసిసి నాయకులు దిగ్విజయ్ సింగ్, జేడి శీలం, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి, బాపిరాజు, చింతా మోహన్, తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మరో మూడు రోజుల పాటు ఎపిలో యాత్ర సాగనుంది. బుధవారం చాగి నుండి అరేకల్ వరకూ యాత్ర సాగనుంది.
అమరావతికి రాహుల్ సపోర్ట్ !
తాము అధికారంలోకి వస్తే ఏకైక రాజధానిగా అమరావతిని చేస్తామని రాహుల్ గాంధీ అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా విరామ సమయంలో అమరావతి రైతులు రాహుల్ గాంధీని కలిశారు. వైసిపి ప్రభుత్వంలో అమరావతి రైతులకు తీరని అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని రైతులు తెలిపారు. తమ పార్టీ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు. దాదాపు 40 మంది రైతులు అమరావతి నుండి రాహుల్ గాంధీని కలిసేందుకే రాగా కొందరికే అనుమతి ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం రైతులకు ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ అమలు చేసిన తరువాతనే ముందుకు వెళ్తామని రాహుల్ గాంధీ పోలవరం రైతులకు హామీ ఇచ్చారు. జోడో యాత్ర విరామ సమయంలో పోలవరం రైతులు రాహుల్ ను కలిశారు. ఆర్ ఓ ఆర్ ప్యాకేజీ ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడం లేదని, ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని రైతులు రాహుల్ గాంధీకి వివరించారు.
బీజేపీ విభజన రాజకీయాలు దేశానకి ప్రమాదమన్న రాహుల్ !
కార్పొరేట్లకు ఉపయోగపడేలా బిజెపి పాలన సాగిస్తోందని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మనేకుర్తి వద్ద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రైతులు తనను కలిశారని, రాజధాని కోసం భూములిస్తే రాజధాని మార్చాలని వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మూడు రాజధానులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అమరావతి రైతుల సమస్య పట్ల తాము చిత్తశుద్దితో ఉన్నామని, రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. బిజెపి విభజన రాజకీయాలు చేస్తూ దేశాన్ని ఎక్కడికక్కడ విడదీస్తోందని, అందుకోసమే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. యాత్రలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నేతలు!
2024లో తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర విరామ శిబిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 41 రోజులు భారత్ జోడో యాత్ర సాగిందని, ఏపీలో నాలుగు రోజులు యాత్ర సాగిన తరువాత తిరిగి కర్ణాటకలోకి ప్రవేశిస్తుందని, ఆ తరువాత తెలంగాణలో సాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ఓట్ల కోసం చేస్తున్న యాత్ర కాదని భారతీయులను ఐక్యం చేసేందుకు చేస్తున్న యాత్రని తెలిపారు. ఏపీలో చాలా సవాళ్లు ఉన్నాయని, యువ నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం పొందుతుందని చెప్పారు. ఆర్థిక అసమానతలు, కుల, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీయటం, ఏక చత్రాధిపత్యంతో రాష్ట్రాల హక్కులను హరించే వాటికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)