YSRCP News : జూన్ 3న హైదరాబాద్‌లో వైఎస్ఆర్‌సీపీ ఐటీ విభాగ సదస్సు - పాల్గొనాలంటే ఇలా చేయాలి !
జూన్ 3వ తేదీన హైదరాబాద్‌లో వైసీపీ ఐటీ విభాగ సదస్సు నిర్వహిస్తున్నారు.
YSRCP News : వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు. వైసీపీ ఐటీ విభాగం అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో వైసీపీ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల సమస్యలపైన కూలం కుషంగా చర్చిస్తారు.
ఈ సదస్సుకు వైసీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులందరూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. సదస్సుకు హాజరు కాదలచినవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఎన్నికలు సమీపిస్తూండటంతో వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుంది. కొద్ది రోజులకిందట బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి ఐటీ ఉద్యోగి.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సునీల్ రెడ్డి సూచించారు.
రానున్న రోజుల్లో ఐటీ విభాగం పార్టీకి ఏ విధంగా సహాయపడుతుంది, చదువుకునే యువతకు ఉద్యోగుల ద్వారా భవిష్యత్ దిశానిర్దేశం గురించి సునీల్ రెడ్డి ఐటీ ఉద్యోగులకు సమావేశంలో వివరించే అవకాశం ఉంది. వైసీపీ ఐటీ విభాగానికి 'ఐటీ ఆర్మీ' అని పేరు పెట్టినట్లు ఆయన చెబుతున్నారు. రానున్న రోజుల్లో చెన్నై, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి వైసీపీ అనుకూల ఐటీ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశం.. యువకుల ఓటు బ్యాంకుతోపాటు, ప్రజల ఓట్లను సొంతం చేసుకోవడంపై పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి సారించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయింది. ఈ మధ్యలో కరోనా మహమ్మారి రావడం, లాక్‌డౌన్ ప్రకటన వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది. ఈ తరుణంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందజేశారు. ఇప్పటికీ నెలకు ఒకటి రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల నిధులను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రతిపక్షాల ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సైతం ఇప్పటికే యాక్టివ్ అయ్యారు. ప్రతి ఇంటికీ వెళ్తూ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెబుతున్నారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వైసీపీ చేస్తున్న మంచిని ప్రజలకు చేరువ చేయాలని వైసీపీ ఐటీ విభాగం ప్రణాళికలు రచిస్తోంది.