Nellore News : మేకపాటి ఫ్యామిలీలో లుకలుకలు, విక్రమ్ రెడ్డి నామినేషన్ నాడు బట్టబయలు
Nellore News : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందనే మాట వినిపిస్తుంది. ఉదయగిరి వైసీపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఓ మహిళ కారణంగా గ్యాప్ పెరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి
Nellore News : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరగబోతున్న ఉపఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా జిల్లా వైసీపీ నేతలంతా కదలి వచ్చారు. జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, గతంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సహా జిల్లా ఎమ్మెల్యేలంతా ఆయనకు మద్దతుగా వచ్చారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే పక్క నియోజకవర్గంలో ఉన్న ఉదయగిరి ఎమ్మెల్యే, రాజమోహన్ రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఇంజినీరింగ్ కాలేజీ గొడవలు!
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. గౌతమ్ రెడ్డి అంత్యక్రియల వరకు చంద్రశేఖర్ రెడ్డి ఆ కుటుంబంతోనే కలసి ఉన్నారు. అయితే కుటుంబ వ్యవహారాలు, ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యంపై ఉన్న గొడవలు పెరిగి పెద్దవయ్యాయి. దీంతో చంద్రశేఖర్ రెడ్డిని రాజమోహన్ రెడ్డి కుటుంబం దూరంగా పెట్టిందని అంటున్నారు.
ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి తరపున ఉదయగిరి వైసీపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఓ మహిళ కారణంగా ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ గ్యాప్ ఇప్పుడు పెరిగి పెద్దదైంది. సొంత అన్న రాజమోహన్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వాట్ నెక్ట్స్
దివంగత నేత గౌతమ్ రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డికి సత్సంబంధాలు ఉండేవి. వారిద్దరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన మరణం తర్వాత ఆ కుటుంబంతో చంద్రశేఖర్ రెడ్డికి దూరం పెరిగింది. ఇటీవల మేకపాటి విక్రమ్ రెడ్డి పరిచయ కార్యక్రమాలకు కూడా చంద్రశేఖర్ రెడ్డి దూరంగా ఉన్నారు. కనీసం ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాలేదు, ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. పోనీ నామినేషన్ వేసే సమయంలో లేరు అనుకున్నా.. అంతకు ముందు ఆ తర్వాత కూడా ఎక్కడా విక్రమ్ రెడ్డి గురించి కానీ, ఆత్మకూరు ఉప ఎన్నికల గురించి కానీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడలేదు. పూర్తిగా ఈ ఉప ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోనీ కుటుంబపరంగా విభేదాలున్నా జిల్లా ఎమ్మెల్యేగా, పొరుకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినా సరే చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకూరులో పర్యటిస్తే పార్టీకి కాస్తో కూస్తో మేలు జరిగే అవకాశముంది. మరి అధిష్టానం ఆ దిశగా సయోధ్య కుదిర్చే అవకాశముందా, లేక మేకపాటి కుటుంబంలో కలహాలు ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.