నల్గొండ ఎమ్మెల్యే టికెట్‌పై గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడి గురి- గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న అమిత్‌రెడ్డి!
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుంఖేందర్ రెడ్డి వారసుడిగా అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ లైన్ దాటకుండా టికెట్ రేసులోకి తీసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గులాబీ పెద్దల ఆశీర్వాదంతో తనయుడిని ఎమ్మెల్యేను చేయాలని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సమయం లేదు బిడ్డా అంటూ కుమారుడిని ప్రొజెక్టు చేస్తున్నారు.
రాజకీయ వ్యూహంలో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి. బీఆర్ఎస్ పెద్దల ఆశీర్వాదం లభించిందని అందుకే కుమారుడిని ప్రజల్లోకి తీసుకొచ్చారనే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
విదేశాల్లో చదువుకున్న గుత్తా అమిత్ రెడ్డి వ్యాపారాల్లో రాణించారు. రాజకీయాల్లో ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో మంచి టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైం వచ్చిందని గుత్తా అనుచరులు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సీటు పక్కా అవుతుందని ధీమాతో ఉన్నారు. అయితే ఇంతలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, అమిత్ రెడ్డి సమాజిక సేవా కార్యక్రమాలతో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందుకే కొన్ని నెలల కిందట తన తాత గుత్తా వెంకట్ రెడ్డి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జనాలతో కనెక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ సైలెంటుగా నెట్ వర్క్ పెంచుకుంటూ పోతున్నారని రాజకీయ సర్కిల్స్‌లో ప్రచారం నడుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరిపై సొంతపార్టీలోనే వ్యతిరేకత ఉందని ప్రచారం నడుస్తోంది. ఇది గులాబీబాస్ కేసీఆర్ వరకూ వెళ్లిందని కూడా చెప్పుకుంటున్నారు. ఇద్దరిని పిలిచి క్లాస్ కూడా పీకినట్టు టాక్. ముఖ్యమంత్రి మందలించినా కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరులో మాత్రం మార్పు లేదంటోంది కేడర్. అంతే కాకుండా తమ వ్యవహార శైలితో పార్టీకి కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తీరుతో అసంతృప్తిగా ఉన్న హైకమాండ్ కూడా గుత్తా అమిత్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఎన్నికలకు కొద్దినెలల సమయమే ఉండటం, టికెట్ రేసులో తాను పోటీలో ఉన్నానని చెప్పేందుకు పొలిటికల్ స్ట్రాటజీలతో దూసుకెళ్తున్నారు గుత్తా అమిత్ రెడ్డి. తనకు తానుగా ఓ వ్యూహకర్తను సంప్రదించి రాజకీయ ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివిటీ డోస్ పెంచారని సమాచారం.
ఉమ్మడి నల్గొం జిల్లాలో యూత్‌కు కనెక్ట్ అయ్యేందుకు నిరుద్యోగులు-విద్యార్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ యాప్ లాంచ్ చేశారు అమిత్ రెడ్డి. సేవా కార్యక్రమాలతో పూర్తిగా పబ్లిక్‌లోనే ఉంటున్నారు. హైకమాండ్ ఆదేశిస్తే నల్గొండ లేదా మునుగోడు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. ఇంత వరకు పొలిటికల్ ఎంట్రీపై అటు గుత్తా సుఖేందర్ రెడ్డికానీ పార్టీ అధినాయకత్వం గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. రాజకీయ ప్రత్యర్థులు కూడా సైలెంట్‌గానే ఉంటున్నారు.
Also Read:కమ్యూనిస్టులకూ కేసీఆర్ దూరమేనా ? జాతీయ రాజకీయాలపై పూర్తిగా ఆలోచన వదిలేశారా ?
Also Read:హుస్నాబాద్ నుంచి బరిలోకి చాడ వెంకటరెడ్డి - స్థానిక ఎమ్మెల్యేకు కూనంనేని సవాల్