Pulivendula YSRCP: పులివెందుల కౌన్సిలర్లకు అవినాష్ రెడ్డి బుజ్జగింపులు - బిల్లుల కోసం కోర్టులో పోరాటం చేద్దామని భరోసా
YSRCP : బిల్లులు రాలేదని ఆందోళన చెందుతున్న పులివెందుల వైసీపీ కౌన్సిలర్లకు ఎంపీ అవినాష్ రెడ్డి సర్ది చెప్పారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే న్యాయపోరాటం చేద్దామని సలహా ఇచ్చారు.
MP Avinash Reddy Meeting Wiht the YCP councilors of Pulivendula : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పులివెందులకు ప్రత్యేకమైన అభివృద్ధి అధారిటీ ఏర్పాటు చేశారు. ఆ అధారిటీ కేంద్రంగా వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వాటిని కౌన్సిలర్లే కాంట్రాక్టులు తీసుకుని చేపట్టారు. పనులు వేగంగా చేపట్టారు. అయితే ఎన్నికలకు ముందు వారికి బిల్లులు ఇవ్వలేదు. మరోసారి వైసీపీనే గెలుస్తుందని.. ఆ తర్వాత బిల్లులు మంజూరు చేస్తామని వైసీపీ అగ్రనేతలు చెప్పడంతో వారంతా మిన్నకుండిపోయారు. వైసీపీ ఓడిపోవడంతో వారికి బిల్లులపై ఆందోళన ప్రారంభమయింది.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనూ వారు జగన్మోహన్ రెడ్డిని బిల్లుల కోసం ప్రత్యేకంగా ప్రశ్నించినట్లుగా ప్రచారం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధిచి రెండు వందల యాభై కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్న విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన సన్నిహితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని.. గతంలో తమ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు చేపట్టిన పనులకు కూడా బిల్లులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు బిల్లులు ఇవ్వకపోతే కోర్టుకు అయినా వెళ్లి పోరాడదామని భరోసా ఇచ్చారు.
జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డితో మహిళా కౌన్సిలర్లు సమావేశమై..బిల్లులు ప్రస్తావన తెచ్చరని చెబుతున్నారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టినా అప్పు తీరదని బిల్లులు రాకపోతే సంక్షోభంలో కూరుకుపోతామని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఏమీ చేయలేమని న్యాయపోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని పులివెందుల కౌన్సిలర్లకు జగన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు తాము ఆర్థిక సాయం చేయలేమని అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి కౌన్సిలర్లతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అందరి సమస్యలనూ జగన్ తెలుసుకున్నారని .. న్యాయపోరాటం చేసి అయినా బిల్లులు ఇప్పిస్తారని అధైర్యపడవద్దని కోరినట్లుగా తెలుస్తోంది.
అయితే బిల్లుల కోసం అయినా కొంత మంది కౌన్సిలర్లు పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. కొంత మంది కౌన్సిలర్లు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలియడంతోనే అవినాష్ రెడ్డి కౌన్సిలర్లతో భేటీ అయ్యారని.. పార్టీ మార్పు లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక పరమైనసమస్యలను పరిష్కరిస్తామని బుజ్జగించినట్లుగా చెబుతున్నారు. ముందుగానే బిల్లులు చెల్లించకపోవడంతో వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.