Media vs Politics: మీడియా వర్సెస్ పాలిటిక్స్, నలిగిపోతున్న నాలుగో స్తంభం!
రాష్ట్రంలో గత నాలుగురోజులుగా జరుగుతున్న పరిణామాలు మీడియావర్సెస్ పాలిటిక్స్‌ను కళ్లకుకడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రతినిధులపైన, కార్యాలయాలపైనా దాడులు పెరిగాయి.
Media vs Politics In AP : భారత దేశం.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అసలు ప్రజాస్వామ్యం అంటే.. శాసన, కార్యనిర్వాహక, పార్లమెంటరీ వ్యవస్థలతో పాటు పత్రికల(Media)కు కూడా సమాన భాగస్వామ్యం కల్పించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా, భావప్రకటనా స్వేచ్ఛ(Freedom of speech)కు సారథిగా పేర్కొన్న పత్రిక.. తర్వాత కాలంలో రూపాంతరం చెంది.. అనేక విభాగాలుగా అభివృద్ధి చెందింది. డిజిటల్, ఎలక్ట్రానిక్, సైట్స్.. ఇలా.. ఏ రూపంలో ఉన్నా.. `ప్రజాప్రయోజనమే పత్రికలకు గీటు రాయి` అన్న తొలి ప్రధాని జవహర్ లాలూ నెహ్రూ(Jawaharlal Nehru) మాటే ఇప్పటికీ శిరోధార్యం. అయితే.. రానురాను.. ఈ ప్రజాప్రయోజనంలో చోటు చేసుకున్న కొన్ని మార్పులు కావొచ్చు.. ముఖ్యంగా పత్రికా రంగంలోకి కార్పొరేట్‌వ్యవస్థ జోక్యంపెరిగిపోవడంకావొచ్చు.. ఏకపక్ష మీడియాను కోరుకుంటున్న పాలకులు, ప్రభుత్వాలు పెరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు ఈ దేశ పత్రికా రంగానికి పెను సవాలుగా మారుతోందన్నది గమనించాల్సిన విషయం.
తొలిపలుకు..
1950లో పార్లమెంటు(Parliament)లో మీడియాపై చర్చ జరిగింది. ``మీడియాను మీరు నియంత్రిస్తున్నారు`` అంటూ.. అప్పట్లో జనతాపార్టీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా ప్రధాని హోదాలో ఉన్న నెహ్రూ.. కీలక వ్యాఖ్యలుచేశారు. ``మీడియా నియంత్రణ ఈ దేశంలో సాధ్యం కాదు. అదే జరిగితే.. ఇది ప్రజాస్వామ్య దేశం కానేకాదు`` అని అన్నారు. ఆయన ఉన్నన్నాళ్లూ అదే పంథాను పాటించారు. సొంత పత్రిక `నేషనల్ హెరాల్డ్`(National Herald)ను నడుపుకొన్నప్పటికీ.. ఆయన ఏనాడూ.. విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు నెహ్రూ నిర్ణయాలను తప్పుబడుతూ.. సొంత పత్రికలో కధనంతో పాటు.. ఎడిటోరియల్ కూడా రాశారు.
77 ఏళ్లలో ..
అలాంటి పరిస్థితి ఇప్పుడు 77 సంవత్సరాల తర్వాత.. ఉందా? అంటే లేదనే చెప్పాలి. దేశంలో మీడియా పరిస్థితి ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగానే మారిపోయింది. ముఖ్యంగా త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. తీవ్రచర్చనీయాంశాలే కాదు.. ఆందోళనలకు కూడా దారితీస్తున్నాయి. నిజానికి 2014 నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారంలో ఎవరు ఉన్నా.. మీడియాను నియంత్రించే పరిస్థితి ఏర్పడిందన్నది నిర్వివాదాంశం. మీరు మా మీటింగులకు రావొద్దంటూ.. గత ప్రభుత్వంలోనూ ఓ మీడియాకు ఆంక్షలు విధించారు.
గత రెండు రోజుల్లో..
ఇక, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా.. కొన్ని మీడియా సంస్థలను నేరుగానే విమర్శిస్తుండడం గమనార్హం. ఇక, గత రెండు రోజుల్లో ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని విధంగా మీడియాపై దాడులు జరుగుతు న్నాయి. ఓ పత్రిక ఫొటో జర్నలిస్టును అధికార పార్టీ నాయకులు తన్నడం.. ఆయన గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందడం తెలిసింది. ఇది ఇంకా తెరమరుగు కాకముందే.. మరో ప్రాంతం(సీమ)లో ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా ఓ పత్రికా కార్యాలయంపై రాళ్లదాడి చేశారు. సిబ్బందిని బెదిరించారు. దీంతో వారు పత్రికా కార్యాలయానికి .. తాళం వేసి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, అదే పత్రికకు చెందిన మరో విలేకరిపైనా.. దాడులు చేశారు. చావు తప్పినట్టు సదరు విలేకరి తృటిలో తప్పించుకున్నారు.
దేశంలో..
భావప్రకటనా స్వేచ్ఛ(ఆర్టికల్ 19)కు పెద్ద పీట వేసే దేశంలో క్రూరమైన చట్టాల కింద అభియోగాలు మోపబడిన జర్నలిస్టుల సంఖ్య భారతదేశంలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదకరమైన స్థితికి సూచనగా మారింది. 2010 నుంచి ఇప్పటి వరకు, దేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద 16 మంది జర్నలిస్టులపై అభియోగాలు మోపారు. సెక్షన్ 13 (చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు), 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యలకు నిధులు సేకరించడం), 18 (కుట్ర) మరియు 22 (సి) UAPAలో, IPC సెక్షన్లు 153A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) మరియు 120B (నేరపూరిత కుట్ర). మీడియాకు వ్యతిరేకంగా సెక్షన్ 153 A కింద కేసులు నమోదు చేశారు.
కొన్ని మీడియా సంస్థలు పాలకుల ఒత్తిళ్లకు లొంగిపోతుంటే... మరికొన్ని ఎదురించి కేసులు, దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి ఒకలా ఉంటే... రాష్ట్ర స్థాయిలో ఒత్తిళ్లు మరోలా ఉన్నాయి. ఒక్క పదం అటు ఇటుగా రాసిన ముఖ్య నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయి. వివరణ ఇవ్వాల్సింది పోయి బెదిరించి వార్తలు రాయించుకునే స్థితికి వచ్చారు నేతలు. నెగిటివిటీ అనే మాటే వినడానికి అంగీకరించడం లేదు. బాకాలు ఊదిన వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న వాళ్లకు తలనొప్పులు తప్పడం లేదు.
ప్రజాస్వామ్య యుతమేనా?
ఈ పరిణామాలు చూస్తే.. వచ్చే ఎన్నికలకు ముందు.. ఇవి ప్రజాస్వామ్య యుతమేనా? అనేచర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. మీడియా కూడా అనే మాట ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తోంది. యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలతో మీడియా మిత్రులు.. ఇప్పుడు తీవ్రమైన సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్న దుస్థితి కళ్లకు కడుతోంది. మరి దీనిని అదుపు చేసేదెవరు? ఎప్పుడు లైన్‌లోకి వస్తాయి? అనేది కాలమే నిర్ణయించాలి!!