Mamata Banerjee: మోదీ ప్రమాణ స్వీకారానికి మేం వెళ్లం, ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో! మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi Oath Ceremony: ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి వెళ్లే ఉద్దేశం కూడా తనకు లేదని మమత తెలిపారు.
Mamata Banerjee On PM Modi Oath: ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం టిఎంసి నాయకులు, ఎన్నికైన ఎంపిల సమావేశంలో పాల్గొన్నారు. మిత్ర పక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చూస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ తర్వాత పరిస్థితి మారొచ్చని అన్నారు. లోక్‌సభలో పార్టీ వ్యూహంపై చర్చించేందుకు టీఎంసీ సీనియర్ నేతలు, ఎంపీల సమావేశం అనంతరం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి వెళ్లే ఉద్దేశం కూడా తనకు లేదని మమత తెలిపారు. మీడియాతో మాట్లాడిన మమత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)పై మండిపడ్డారు.
#WATCH | When asked if she will attend the swearing-in ceremony of PM-designate Narendra Modi, West Bengal CM Mamata Banerjee says, "I have not received (the invitation), nor will I go." pic.twitter.com/rceOxvT3ly
— ANI (@ANI) June 8, 2024
దేశం మార్పు కోరుకుంటుంది
దేశంలో మార్పు రావాలని మమతా బెనర్జీ అన్నారు. దేశం మొత్తం మార్పు కోరుకుంటోంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశప్రజలతో పాటు, మా పార్టీ నాయకులు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉంది. అందుకే ఆయన ఈసారి ప్రధాని కాకూడదని టిఎంసి చీఫ్ మమత అన్నారు. మరొకరికి ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి అవకాశం కల్పించాలన్నారు.
టీఎంసీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా మమతా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. లోక్‌సభలో పార్టీ నాయకురాలిగా పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, లోక్‌సభ డిప్యూటీ లీడర్‌గా డాక్టర్ కాకోలి ఘోష్ దస్తీదార్, చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ ఎన్నికయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ మెరుగైన ఫలితాలు
ఈసారి లోక్‌సభ 2024 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి అద్భుత ప్రదర్శన చేసింది. కొందరు రాజకీయ విశ్లేషకులు బీజేపీకి ఆరు-ఏడు సీట్లు పెరుగుతాయని అంచనా వేయగా, ఓట్ల లెక్కింపులో బీజేపీ 10 స్థానాలకు తగ్గింది. 31 సీట్లపై టీఎంసీ జెండాలు ఎగురవేసి.. ఇక్కడ బీజేపీ ఇప్పటికీ బయటి పార్టీనే అని మమత నిరూపించారు. బీజేపీ కూడా ఈసారి చాలా సీట్లు కోల్పోయింది. ఈసారి మమతకు ఏకపక్ష ముస్లిం ఓట్లు వచ్చాయి. ఇక్కడ మమత హిందూ కార్డును ప్లే చేసింది. తన హిందూ ఓటు బ్యాంకును జారిపోనివ్వలేదు. ఫలితాలతో మమత తన బెంగాలీ గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంది. లక్ష్మీభండార్ యోజన, ఖాతాలో ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామన్న ప్రకటన తీవ్ర ప్రభావం చూపింది.
పార్లమెంట్‌లో గళం విప్పనున్న టిఎంసి
సార్వత్రిక ఎన్నికల్లో టిఎంసి మెరుగైన ఫలితాలు సాధించినందుకు సంతోషిస్తున్నాం అన్నారు మమతా బెనర్జీ. పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రద్దు చేయాలని తమ పార్టీ పార్లమెంటులో గళం విప్పుతుందని చెప్పారు. లోక్‌సభలో బీజేపీ బలం బలహీనపడటాన్ని మమత ప్రస్తావిస్తూ.. గతసారి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించామని, అయితే ఈసారి అలా చేయడం కుదరదని చురకలు అంటించారు.