Chalo Munugode : అన్ని పార్టీల దారి మునుగోడు వైపే - రాజకీయం అంతా ఇక అక్కడే !
మునుగోడును అన్ని పార్టీల నేతలు రౌండప్ చేస్తున్నారు. షెడ్యూల్ రాక ముందే విజయం కోసం కసరత్తులు ప్రారంభించారు.
Chalo Munugodu : అందరి దారి మునగోడు వైపే. అందరి చూపు మునుగోడు వైపు. రాజగోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయగానే ఇలా ఆమోదించారు. అంతకు ముందు నుంచే అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. అగ్రనేతలు వస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ఆదివారం ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో అడుగు పెడుతున్నారు. అసలు షెడ్యూల్ రాక ముందే అన్ని పార్టీలు యుద్ధం ప్రారంభించేశాయి.
టీఆర్ఎస్ పక్కా స్కెచ్ !
ఈ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలమేంటో ఇతర పార్టీలకు చాటి చెప్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్ ‘మునుగోడు ప్రజాదీవెన సభ’ను భారీగా నిర్వహించి సత్తా చాటాలని భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 20 వేల మంది చొప్పున 1.20 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అమిత్ షా ప్రచార సభకు ముందే తమ సత్తా ఏంటో చాటేందుకు టీఆర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతున్నదో చెప్పడంతోపాటు బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ప్రకటించారు. ఇక్కడా అదే ఫార్ములా పాటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అమిత్ షా సమక్షంలో బలప్రదర్శన చేయనున్న రాజగోపాల్ రెడ్డి !
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు బైపోల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇదే వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీలో చేరనుండడంతో ఈ సభ సక్సెస్ చేసేందుకు కమలదళం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కేసీఆర్ సభకు మించి అమిత్ షా సభ విజయవంతం చేసి.. బీజేపీకి ప్రజల్లో ఉన్న మద్దతును రాష్ట్రవ్యాప్తంగా చాటి చెప్పాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జన సమీకరణపై దృష్టి పెట్టారు. మునుగోడు శివారులో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కనీసం లక్ష మందికి సరిపోయేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. సభ సక్సెస్ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను కూడా నియమించింది. రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి.. బలప్రదర్శన చేయాలనుకుంటున్నారు.
మునుగోడులోనే మకాం వేయనున్న రేవంత్ రెడ్డి !
కరోనా నుంచి కోలుకున్న రేవంత్ రెడ్డి శనివారం నుంచే మునుగోడులో మకాం వేస్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ‘మన మునుగోడు, మన కాంగ్రెస్’ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తనతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ఓట్లు అడగాలని నిర్దేశించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. ‘మన వెయ్యి మంది నాయకులు లక్ష మందికి పాదాభి వందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం’ అని పిలుపునిచ్చారు. తను కూడా స్వయంగా మునుగోడులోని తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వారికి వందనాలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యన్ని పరిరక్షించే యుద్ధంలో పాల్గొనబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు.
ఉపఎన్నిక ముగిసేవరకూ ఇదే హడావుడి !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇతర పార్టీల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి. అగ్రనేతలందరూ ఆ ఎన్నికపైనే దృష్టి పెట్టనున్నారు. దీంతో మునుగోడు వైపు అందరి దృష్టి ఉంది.