Komatireddy : కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా - మునుగోడు ప్రజలకు మేలు చేయడానికేనని వివరణ !
ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది.
Komatireddy : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని అనుచరులతో భేటీ తర్వాత ప్రకటించారు. తన రాజీనామాపై చాలా కాలంగా చర్చ నడుస్తోందన్నారు. ఇంకా దీన్ని సాగ దీసే ఉద్దేశం లేదని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడదామని చాలా సార్లు చూశానని వెల్లడించారు. కానీ ప్రయోజనం కనిపించలేదన్నారు. ఇప్పుడు ఉపఎన్నికలు వస్తేనే నిధులు వస్తాయని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు . అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్ిడ తెలిపారు.
తెలంగాణలో కుటుంబ పాలన ఉందన్న రాజగోపాల్ రెడ్డి
రాజీనామా ప్రకటన సమయంలో టీఆర్ఎస్ సర్కార్‌పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలుచేశారు. ప్రతి విషయంలో కూడా ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని.. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఒక ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కుటుంబం కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానన్నారు. ఇంకా 18 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిధులు వస్తాయని అభివృద్ధి చేస్తారన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఈ రాజీనామా అంశాన్ని కూడా ప్రభుత్వ అనుకూల మీడియా తెరపైకి తీసుకొచ్చిందన్నారు.
ఉపఎన్నికతో మునుగోడుకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్న రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో పోడు భూముల సమస్య ఉంది. ప్రభుత్వం చాలా సార్లు పరిష్కరిస్తామని చెప్పింది కానీ ఇంత వరకు చేయలేదని కోమటిరెడ్డి గుర్తు చేశారు. చాలా మంది ప్రజలు ఈ విషయంలో బాధ పడుతున్నారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించలేని పదవులు ఎందుకని ఆలోచించాను అన్నారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. నయా నిజాంలా కేసీఆర్ పరిపాలిస్తున్నారని విమర్శించారు. మూడు ఎకరాల సంగతి కేసీఆర్ ఎప్పుడో మర్చిపోయారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. అయినా ఎక్కడా తెలంగాణలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కొద్ది మందికి దోచి పెడుతున్నారన్నారు. దేశంలో ఇంత ఘోరంగా ఎక్కడా పాలన సాగడం లేదు. పరిపాలనను రాచరిక వ్యవస్థలా మార్చేశారని విమర్శిచారు.
రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి కాదని విమర్శలకు కౌంటర్
తనపై వస్తున్న విమర్శలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి ఎప్పుడూ అమ్ముడుపోలేదన్నారు. ఎప్పుడూ అమ్ముడు పోడన్నారు. తన వ్యాపారానికి రాజకీయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకే పదవులు కావాలంటే ఎప్పుడో టీఆర్‌ఎస్‌లో చేరేవాళ్లమన్నారు. వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని చేయలేదు... చేయబోమన్నారు. అలాంటి వ్యక్తులను ఇంతటి మాటలు అంటుంటే... బాధనిపిస్తోందన్నారు. మునుగోడు ప్రజలకు తన రాజీనామా న్యాయం చేయాలన్నారు.