Khammam Politics : పొంగులేటి ఏ గట్టునుంటారో? మునుగోడు ఫలితాల తర్వాతే నిర్ణయం!
Khammam Politics : తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న మునుగోడు ఉపఎన్నిక తర్వాతే పార్టీల మధ్య జంపింగ్ లు ఉంటే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం మునుగోడు ఉపఎన్నిక తర్వాతే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
Khammam Politics : మునుగోడు ఉపఎన్నిక ఫలితాల ఆధారంగానే తెలంగాణ రాజకీయాలు మారుతాయని, అక్కడ ఏ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత మూడేళ్లు పార్టీలో పదవి లేకుండా అసంతృప్తితో ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు. 2012లో రాజకీయ అరంగ్రేటం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఖమ్మం జిల్లాలో చరిత్ర సృష్టించారు. ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్ అధికంగా ఉండటంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతోపాటు తాను ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
పార్టీ మారతారనే ప్రచారం
అప్పట్నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉనప్పటికీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మాత్రం టిక్కెట్ కేటాయించలేదు. ఆ తర్వాత వరుసగా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇస్తారని, రాజ్యసభ ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ పొంగులేటికి మాత్రం అవకాశం దక్కలేదు. మరోవైపు పార్టీ పదవులు కూడా ఇవ్వకపొవడం గమనార్హం. పార్టీలో ప్రాధాన్యత తగ్గినప్పటికీ పొంగులేటి మాత్రం తరుచూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనలు చేస్తూ తన అనుచరగణాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. అయితే అప్పట్నుంచి అసంతృప్తిగా ఉన్న పొంగులేటి పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ ఈ విషయంపై స్పష్టత రాలేదు.
బీజేపీనా? కాంగ్రెసా?
టీఆర్‌ఎస్ పార్టీని పొంగులేటి వీడితే ఆయన బీజేపీలో చేరుతారా? లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అనే విషయంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. నాయకులు పార్టీ ఫిరాయించినప్పటికీ ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉంది. అయితే పొంగులేటి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అటు పార్టీ బలోపేతం కావడంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని పొంగులేటి కలిశారని, పార్టీ మార్పుపై ఆయన సలహా తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో పొంగులేటిని బీజేపీలో వెళ్లాలని వై.ఎస్.జగన్ సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే అది కూడా జరగలేదు.
మునుగోడు ఫలితం తర్వాతే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రభావం అంతగా లేదు. దీంతోపాటు కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉండే జిల్లాలో బీజేపీకి వెళ్లడం ఎంత మేరకు తనకు సహకరిస్తుందనే విషయంపై పొంగులేటి ఆలోచనలో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమైందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై జిల్లాలో తరుచూ చర్చ జరుగుతునప్పటికీ మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు అటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనున్న సమయంలో అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగానే మిగిలిన జిల్లాలో ఉన్న అసంతృప్తులు సైతం పార్టీ మారే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. మరి మునుగోడు ఉపఎన్నికల తర్వాత పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం వేచి చూడాల్సిందే.
Also Read : Gutta Sukender: విలీనం, విమోచనం అంటే అర్థం తెలియనోళ్లూ మాట్లాడుతున్నారు - గుత్తా సుఖేందర్