Amalapuram Cases : వైఎస్ఆర్‌సీపీ అంతర్గత రాజకీయాలే కోనసీమ అల్లర్లకు కారణం - మంత్రిని టార్గెట్ చేసుకున్న అనుచరులు !?
అమలాపురం అల్లర్ల విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వరూప్ అనుచరులే ఈ అల్లర్లకు పాల్పడినట్లుగా గుర్తించారు.
Amalapuram Cases : అమలాపురం అల్లర్ల కేసులో అమలాపురం పట్టణ వైఎస్ఆర్‌సీపీ కీలక నాయకులు హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వీరంతా ఒకప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు ముఖ్య అనుచరులే . అంతే కాదు అల్లర్లకు కారణంగా భావిస్తున్నవీరంతా వైఎస్ఆర్‌సీపీలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారే. పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా ఏర్పడిన విభేదాలను కోనసీమ జిల్లా పేరు ఉద్యమం పేరిట అరాచకం సృష్టిం చేందుకు వినియోగించుకున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అల్లర్లు, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పుపెట్టిన కేసుల్లో కీలక నిందితునిగా దొరికిన వీరవెంకట సత్యప్రసాద్ వాంగ్మూలంతో నలుగురిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
కుట్రను బయట పెట్టిన డీజీపీ !
అల్లర్లు జరిగిన చాలా రోజుల తర్వాత అమలాపురం వచ్చిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. దగ్ధమైన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను పరిశీలించిన అనంతరం అమలాపురం కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో డీజీపీ పలు అంశాలు వెల్లడించారు. ఇదంతా ప్లాన్డ్ ప్రకారం జరిగిన విధ్వంసం అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అనుమానితులుగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు కొందరు దూర ప్రాంతాలకు ఉద్దేశపూర్వకంగా వెళ్లిపోయి వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ ద్వారా విధ్వంశానికి పథక రచన చేశారని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత రాజకీయాలే కారణం !
అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఓ యువ నాయకుడు తన తల్లికి మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి ఇప్పించాలని అనుకున్నారు. అదే సమయంలో దివంగత వైఎస్ఆర్‌సీపీ నేత కోడలు కూడా అదే పదవి ఆశించారు. అయితే ఆమె ఓటమి పాలయింది. తన ఓటమికి యువనాయకుడే కారణంఅని ఆమె పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఛైర్ పర్సన్ పదవి పోటీలో ఉన్న మహిళా కార్పోరేటర్ కేరక్టర్ ను కించప రిచే విధంగా ఓ ఆడియో వైరల్ అయ్యి సంచలనం అయ్యింది. దీనిపై అప్పట్లో తన తల్లికి చైర్ పర్సన్ పదవి ఆశించిన యువ నాయకుని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆడియో తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ యువ నాయకుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై అధిష్టానం ఆగ్రహించి ఛైర్ పర్సన్ పదవికోసం రేసులో లేని ఓ మహిళా కార్పొరేటర్ కు పదవి కట్టబెట్టింది. దీంతో వివాదం సద్దుమణిగినా ఆ నాటి పరిణామానాలు దృష్టిలో ఉంచుకునే మంత్రి విశ్వరూప్ పై లోలోపల కక్ష ఉంచుకున్నారని, కోనసీమ జిల్లా పేరు ఉద్యమాన్ని ఇలా వాడుకునే ప్రయత్నం చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది..
ఎఫ్ ఆ అర్ లో నమోదు చేసిన పేర్లు..
తాజాగా పోలీసులు నమోదు చేసిన జాబితాలో అమలాపురం పట్టణానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు పేర్లు బయటకు వచ్చాయి. వీరంతా విశ్వరూప్ అనుచరులే... ఏ225గా సత్యరుషి, ఏ226 గా వాసంశెట్టి సుభాష్, ఏ227గా మట్టపర్తి మురళీకృష్ణ, ఏ 228గా రఘు అనే వ్యక్తులను చేర్చారు. వీరంతా వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా అల్లర్లను ప్రేరేపించినట్లుగా పోలీసులు అరెస్ట్ అయ్యిన కొందరి వాంగ్మూలం ద్వారా ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.