KCR Maharastra : నాందెడ్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారా ? మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి అందుకేనా ?
కేసీఆర్ నాందేడ్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా ?మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం మాస్టర్ ప్లాన్ వేశారా ?సర్వేలు, చేరికలతో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభమయిందా ?
KCR Maharastra : టీఆర్ఎస్‌ను భారత రాష్ట్రసమితిగా కేసీఆర్ మార్చారు కానీ.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మొదట్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్ని ప్రగతి భవన్ కు పిలిపించి చర్చించేవాళ్లు. ఏపీ, ఒడిషాలకు స్టేట్ ఇంచార్జులను నియమించారు. కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఒక్క మహారాష్ట్రలో మాత్రం అదీ కూడా ఓ ప్రాంతంలో మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీని విస్తరిస్తున్నారు. దీని వెనుక అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియదు. కానీ.. కేసీఆర్ మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం మాత్రం గుప్పుమంటోంది.
నాందేడ్ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా ?
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ తో పాటు తెలంగాణ సరిహద్దు ఉన్న మహారాష్ట్రలోని ఏదైనా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. నాందేడ్ అయితే కరెక్ట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ దిశగా సర్వేలు కూడా చేయించినట్లుగా చెబుతున్నారు. అక్కడ నుంచి ఇప్పటికే చేరికలు జోరుగా సాగాయి. పార్టీని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సులువవుతోందని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ వేవ్ ఉందంటున్న నేతలు
ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. గతంలో ఇందిరాగాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీని వదులుకుని మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. గతంలో చాలామంది నేతలు తమ సొంత రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమ పార్టీని వేరే రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయడం, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలా నేతలు వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. అందుకేమహారాష్ట్ర నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ పోటీ..గతంలోనూ ఇదే వ్యూహం
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసి లోక్ సభకు వెళ్లారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఉద్యమాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కేసీఆర్ పోటీ చేయడం వల్ల అక్కడ పార్టీకి మైలేజ్ పెరగడంతో పాటు బీఆర్ఎస్ గురించి ప్రజల్లో చర్చ జరుగుతుందనేది ఆపార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇక అక్కడి నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న పలు సంస్థలతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించుకున్నారట. మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలిచి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలకం కానున్నారు. అప్పుడు తెలంగాణ సీఎంగా కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు బలమైన వ్యక్తులతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.