Srikakulam Politics : పదవుల పంపకం తర్వాత తప్పిన లెక్క - సిక్కోలులో వైఎస్ఆర్‌సీపీపై కాళింగుల అసంతృప్తి !
పదవుల పంపకం తర్వాత తమకు ప్రాధాన్యం దక్కలేదని కాళింగ సామాజికవర్గం నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. అంతా ధర్మాన కుటుంబానికేనా అన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంత్రివర్గం మార్పు తర్వాత పార్టీ బాధ్యతల పంపకం ఉత్తరాంధ్రకు సంబంధించి హేతుబద్దంగా కనిపించడం లేదు. పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలనే సంతృప్తిపర్చలేకపోతోంది. ఉప ముఖ్య మంత్రులుగా ఉన్నతస్థాయి గౌరవం ఇచ్చిన కృష్ణదాస్, పుష్పశ్రీవాణిలకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలకే పరిమితం చేయడం ఒక రకంగా వారి స్థాయిని తగ్గించడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణ మంత్రిగా వారితో పని చేసిన బొత్స సత్యనారాయణను మూడు జిల్లాల కోఆర్డినేటర్గా నియమించడం కూడా చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మంత్రిగా కొనసా గిస్తూ మూడు జిల్లాల బాధ్యతలు కట్టబెట్టడం గత మంత్రి వర్గంలో ఉన్నవారిని అవమానించడంగా భావిస్తున్నారు. కాపుల ఆధిక్యత ఈ మూడు జిల్లాల్లో ఉందని భావిస్తే, పాత ఉత్తరాంధ్రలోని నేటి ఐదు జిల్లాల్లో వెలమలకు దక్కిన గౌరవం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణిని తప్పించి కాళింగుల గౌరవాన్ని తగ్గించినట్టు కనిపిస్తుంది.
కాళింగులకు ప్రాధాన్యం కల్పించి ఓటు బ్యాంక్‌గా మార్చుకున్న సీఎం జగన్ !
పార్టీని స్థాపించిన తర్వాత మంత్రివర్గం మార్పు ముందు వరకు కాళింగులకు జగన్ పెద్దపీట వేశారు. ముగ్గురికి ఎమ్మెల్యే టిక్కెట్లు, ఒక ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ అధికారానికి రాక ముందు కాంగ్రెస్‌లో కాళింగులకు మంచి గుర్తింపు, గౌరవం దక్కింది. కాళింగులు అనేకం ఉన్నా కాళింగుల సొంతమనుకున్న ఎంపీ పదవి కింజరాపు కుటుంబానికి సొంతమైంది. నియోజక వర్గాల విభజనలో కాళింగులదే అనుకున్న టెక్కలి కింజరాపు కుటుంబం చేతుల్లోకి పోయింది. వైఎస్ హయాంలో ఎంపీగా కృపా రాణికి అవకాశం వచ్చింది. గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గం లోకి ఆమెను చేర్చి పెద్ద గౌరవాన్నే కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చింది. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఇచ్చింది. డీసీసీకి నాయకత్వం వహించిన తొలి మహిళగా ఆమెకు రికార్డు దక్కింది. అయితే, ఆమెను ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ చేయడానికి ఆనాడు ధర్మాన ప్రసాదరావు వ్యూహం దీనికి కారణం. వైఎస్ఆర్‌సీపీ ఏర్పాటు తర్వాత కాళింగులను ఓటుబ్యాంకుగా మార్చుకోడానికి జగన్ చాలా ప్రయత్నమే చేశారు.
పదవుల పంపకం తర్వాత మారిన సీన్ !
ఎంపీ అభ్యర్థిగా కాపు కులానికి చెందిన రెడ్డి శాంతిని నిర్ణయించి ఒక ప్రయోగం చేసినా ఫలించలేదు. రెండో సారి దువ్వాడ శ్రీనివాస్ ను ఎంపిక చేసి చాలామందిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే అభ్యర్థుల సహకారం లేక క్రాస్ ఓటింగ్ వల్ల శ్రీనివాస్ తక్కువ ఓట్లతో ఓడిపోయారు. శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ చేసి అచ్చెన్నాయుడుకు ధీటుగా అతన్ని ప్రోత్సహించారు. ఇచ్ఛాపురంలోఓడిపోయిన సాయిరాజ్ భార్యను జెడ్పీ చైర్‌పర్సన్‌ను చేశారు. పార్టీలో ఆలస్యంగా చేరిన కృపారాణికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంత్రివర్గం మార్పుతోకులాల తూకం దెబ్బతిన్నదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది.
జిల్లాను ధర్మాన కుటుంబానికి రాసిచ్చేశారా ?
మంత్రిగా ప్రసాదరావును తీసుకొని జిల్లా పార్టీ బాధ్యత కృష్ణదాస్ కు అప్పగించడం వల్ల జిల్లా పార్టీపై పెత్తనమంతా ఒక కుటుంబానికే అప్పగించినట్లయింది. బంధుత్వాలు, కుల సంబంధాలు బలంగా ఉన్న కృష్ణదాస్‌కు పాత ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేదన్నది చాలామంది అభిప్రాయం. కాళింగుల్లో చాలామంది ఆశించినట్లుగా సీతారాంకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో గత పద్దెనిమిదేళ్ల నుంచి ఆ కులానికి మంత్రి పదవి యోగం పట్టనట్టయింది. కేంద్ర మంత్రివర్గంలో పని చేసిన డాక్టర్ కృపారాణిని జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం కూడా కాళింగుల ప్రాధాన్యత తగ్గించినట్ల యింది.
ప్రాధాన్యం కోరుకుంటున్న కాళింగులు!
బీసీ మహిళ కోటాలో కిల్లి కృపారాణిని రాజ్యసభకు పంపిస్తే ఆ కులానికి న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కాళింగుల్లో ఉంది. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆమెకు గల అనుభవం ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్‌సీపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం ప్రసాదరావు సహకారంతో కృష్ణదాస్‌కు పెద్ద కష్టంకాదు. కాకపోతే సంస్థాగతంగా చక్కదిద్దే పనులు పెద్దగా లేవు. కాళింగులకు మంత్రి పదవి దక్కుతుందని ఎంతో ఆశతో చూసినప్పటికీ తమ్మినేనికి అవకాశం లభించలేదు. తమ్మినేని సీతారాం మీద జగన్‌కు అంత సదభిప్రాయం లేదని భావిస్తున్నారు. కిల్లి కృపారాణి కిఅయినా రాజ్యసభ ఇవ్వాలని ఆ వర్గం వారు కోరుతున్నారు.