Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
Telangana News: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల పోటీ నుంచి తప్పుకొన్నారు.
BRS Mp candidate Kadiyam Kavya Key Decision: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ (KCR)కు లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. 'ఇటీవల మీడియాలో వస్తోన్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. అంతే కాకుండా, వరంగల్ జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరికొకరి మధ్య సహకారం కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తలు నన్ను మన్నించాలి.' అని కావ్య లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆమె కేసీఆర్ కు లేఖ రాయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
వరుస షాకులు
బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంపీ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. వారు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు విజయలక్ష్మి ప్రకటించారు. గురువారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన సీనియర్ నేత కె.కేశవరావు పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను ఎందుకు పార్టీ మారుతున్నదీ గులాబీ బాస్ కు వివరించారు. ఆయనతో భేటీ అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ తో చర్చించానని చెప్పారు. పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగిందని.. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. 'కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నాకు బాగా సహకరించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీలోకే వెళ్లాలని నిర్ణయించుకున్నా.' అని కేశవరావు స్పష్టం చేశారు. అయితే, కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు ఉన్న ఇబ్బందులను ఆయన చెప్పబోగా.. సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. అయితే, 'నేను పుట్టింది కాంగ్రెస్ లో.. కాంగ్రెస్ లోనే చనిపోతాను.' అని కేకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. కేసీఆర్ కేకేతో అన్నట్లు తెలుస్తోంది. అటు, అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని కేకే కుమార్తె విజయలక్ష్మి పేర్కొన్నారు.
Also Read: Kesavarao: కాంగ్రెస్ లోకి కె.కేశవరావు, విజయలక్ష్మి - అధికారిక ప్రకటన, ముహూర్తం ఫిక్స్