BJP Plan With KA Paul : తెలంగాణలో బీజేపీ పావుగా కేఏ పాల్ ! ఓట్ల చీలిక కోసం ప్రోత్సహిస్తున్నారా ?
తెలంగాణ రాజకీయాల్లో కేేఏ పాల్ బీజేపీ వ్యూహాంలో భాగంగానే యాక్టివ్ అవుతున్నారన్న అభిప్రాయం ఇతర పార్టీల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ ఎజెండా ప్రకారం ఆయన వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు.
కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ప్రజాశాంతి అంటూ పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మాత్రం తెలంగాణను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అమెరికా నుంచి వచ్చీ రాగానే గవర్నర్ తమిళిసైతో రెండు, మూడు సార్లు భేటీ అయ్యారు. ఇప్పుడు అమిత్ షాతో సమావేశమై.. కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాను తెలంగాణపైనే గురి పెట్టానంటున్నారు. ఇంతకూ కేఏ పాల్ రాజకీయాల్ని ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారు ? ఆయనపై ఆయనకు అతి నమ్మకమా ? లేకపోతే ఎవరి రాజకీయ వ్యూహంలో అయినా భాగమవుతున్నారా?
అమెరికా నుంచి రాగానే గవర్నర్‌తో చర్చలు
గత ఎన్నికల తర్వాత అమెరికా వెళ్లిపోయి.. ఈ ఎన్నికలకు ఏడాది ముందే రంగలోకి దిగారు. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు జరుగుతాయనో లే్కపోతే తన కార్యాచరణ తెలంగాణ అని డిసైడ్ చేసుకున్నారో కానీ పెద్ద ఇల్లు తీుకుని కొత్త కార్ల కాన్వాయ్‌తో బయలుదేరుతున్నారు. ఆయన ఏపీ వైపు చూడటం లేదు. తెలంగాణలోనే తిరుగుతున్నారు. తాజాగా అమిత్ షాతో కూడా భేటీ అయి.. కేసీఆర్, కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆయన తెలంగాణలో రాజకీయం ప్రారంభించినప్పటి నుండి బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా ఆయన చర్యలు ఉన్నాయి. అమెరికా నుంచి రాగానే గవర్నర్ తమిళిశైని కలిశారు. కేసీఆర్ జైలుకెళ్తారని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత నుంచి ఆయన దూకుడు ప్రారంభమైంది. . ప్రెస్ మీట్లు పెట్టి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని ప్రకటించారు.
అమిత్ షాతోనూ చర్చలు !
ఇటీవల సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించాడనికి వెళ్లినప్పుడు ఆయనపై దాడి జరిగింది. దాంతో ఆయన ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. చాలా మంది అమిత్ షాతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తారు కానీ దొరకడం కష్టం. కానీ కేఏ పాల్ ఇలా ఢిల్లీ వెళ్లగానే అలా అపాయింట్ మెంట్ దొరికింది. తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, అలాంటి స్థాయిలో తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలను చర్చించానని చెప్పారు. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు వారి దాడులు, రూ.లక్షల కోట్లు మాయమయ్యాయని ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. షాతో భేటీ తర్వాత కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సహజంగానే ప్రాధాన్యత లభించింది.
పాల్‌కు డైరక్షన్స్ బీజేపీనే ఇస్తోందా ?
కేఏ పాల్ తన రాజకీయాలకు ఎందుకు తెలంగాణను ఎంపిక చేసుకున్నారో రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. ఆయనను సీరియస్‌గా తీసుకుని టీఆర్ఎస్ నేతలు ఆయనపై దాడికి పాల్పడటం ఆయనకు మరింత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. తనపై దాడి విషయాన్ని చెప్పుకోవడానికి సమయం అడిగితే అమిత్ షా వెంటనే ఇచ్చేశారు. దీంతో పాల్ వెనుక బీజేపీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న బీజేపీ ఓటు సమీకరణాలు లెక్కల్లో బాగంగా కేఏ పాల్‌ను ప్రోత్సహిస్తోందని అంటున్నారు. ఏ పార్టీకి అయినా తాము సాధించే ఓట్లతో పాటు ప్రత్యర్థులు సాధించే ఓట్లను కూడా చీల్చడం విజయానికి కీలకం. ఈ ప్రకారం టీఆర్ఎస్‌కు మద్దతిచ్చి క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను చీల్చడానికి పాల్‌ను బీజేపీ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
క్రైస్తవుల్లో పాల్ ప్రసంగాలకు ఆకర్షితులయ్యేవారు వేల మంది !
కేఏ పాల్ అంటే ఇప్పుడు చాలా మంది తేలిగ్గా తీసుకోవచ్చు కానీ.. ఆయన ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధ శాంతిదూత. మత ప్రబోధకుడు. ఓ ఇరవై ఏళ్ల కింద ఆయన పెట్టే మత సమావేశాల ప్రసంగాలు వినేందుకు ... లక్షల మంది వచ్చేవారు. అది ఒక్క ఇండియాలో కాదు.. అనేక దేశాల్లో ఆయనకు పాలోయింగ్ ఉంది. అమెరికాలోనూ గుర్తింపు ఉంది. ఆయన ప్రసంగాలు క్రైస్తవుల్ని ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. పాల్ లాంటి వారు నియోజకవర్గానికి ఐదు వందల ఓట్లు చీల్చినా బీజేపీకి లాభమే. ఆ మేరకు ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంక్ తగ్గుతుంది. బీజేపీ ఒక్క పాల్ మీదే ఆధారపడటం లేదు. ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అందుకే పాల్ చేసే సాయం కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎలా చూసినా పాల్ ఇప్పుడు బీజేపీ ప్రభావంలో ఉన్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.