Pawan Kalyan: 'అధికారం, డబ్బు అండతో సీఎం జగన్ అహంకారం' - ఏపీలో కూటమిదే పీఠమన్న జనసేనాని పవన్ కల్యాణ్
Andhra News: రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జనసేనాని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేట బహిరంగ సభలో ఆయన సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan Slams Cm Jagan In Prajagalam Meeting: ఏపీ సీఎం జగన్ అధికారం, డబ్బు అండతో విర్రవీగుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawankalyan) మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఏర్పాటు చేసిన 'ప్రజాగళం' (Prajagalam) బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగించారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 'సీఎం జగన్ ఓ సారా వ్యాపారి. దేశమంతా డిజిటల్ వైపు అడుగులేస్తూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే.. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో మాత్రం నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు. ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40 వేల కోట్లు దోచేశారు. రాష్ట్రం డ్రగ్స్ కు రాజధానిగా మారింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా.. ఈ రోజు -3 శాతానికి పడిపోయిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.' అని పవన్ విమర్శించారు.
'పొత్తుదే గెలుపు'
ధర్మందే విజయం
— JanaSena Party (@JanaSenaParty) March 17, 2024
పొత్తుదే గెలుపు
కూటమిదే పీఠం
✊#PrajaGalam#BJP #JSP #TDP pic.twitter.com/YL7qHQo5a7
రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో రామరాజ్యం స్థాపన జరగబోతోందని పవన్ అన్నారు. 'అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఏపీ ప్రజానీకానికి ప్రధాని మోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే కలయిక.. 5 కోట్ల మంది ప్రజలకు ఆనందం. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. అయోధ్యలో రామ మందిరం కట్టిన ప్రధాని మోదీకి.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసురుడిని తీసేయడం కష్టం కాదు. వచ్చే ఎన్నికల్లో ధర్మానిదే విజయం. పొత్తుదే గెలుపు.. కూటమిదే అధికారం. అమరావతికి అండగా ఉంటామని చెప్పేందుకే మోదీ వచ్చారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 2024లోనూ మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుంది. 2014లో వెంకటేశుని ఆశీస్సులతో ఎన్డీయే విజయం సాధించింది. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో అంతకు మించి విజయం సాధిస్తాం.' అని పేర్కొన్నారు.
పవన్ స్పీచ్ కు బ్రేక్.. ప్రధాని విజ్ఞప్తి
'ప్రజాగళం' బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తుండగా ఆసక్తికర ఘటన జరిగింది. పవన్ స్పీచ్ ను మధ్యలో ఆపిన ప్రధాని మోదీ.. పోల్స్ ఎక్కిన కార్యకర్తలను హెచ్చరించారు. సభలో పాల్గొన్న కొందరు.. నేతలను చూసేందుకు లైటింగ్ పోల్స్ ఎక్కారు. దీన్ని గమనించిన మోదీ వారిని దిగాలని మైక్ లో విజ్ఞప్తి చేశారు. 'మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. కరెంట్ తీగలకు దూరంగా ఉండాలి' అని కోరారు. పోలీసులు కల్పించుకుని వారిని కిందకు దించాలని సూచించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లైటింగ్ పోల్స్ ఎక్కిన వారిని కిందకు దించారు.
Also Read: Chandrababu: జెండాలు వేరైనా 3 పార్టీల అజెండా ఒకటే, ఈ ఎన్నికల్లో గెలుపు NDAదే: చంద్రబాబు