Nadendla Manohar: 'వాలంటీర్ల వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా?' - ఏపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు
Andhrapradesh Politics: ఏపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
Nadendla Manohar Slams Ysrcp Government on Volunteer System: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేక బాధ పడుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ఏనాడైనా సీఎం జగన్ మాట్లాడారా.? అని ప్రశ్నించారు. 'వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి జనసేనాని పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రతి ఏడాది రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తుండగా.. దానిలో రూ.617 కోట్ల డేటా సేకరణ కోసం కేటాయించారు. ఇంటింటి సమాచారం సేకరించాలని వారికి ఎవరు చెప్పారు.? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా.? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు.?. ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పకుండా మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేన పార్టీకి వాలంటీర్లపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు.' అని స్పష్టం చేశారు. కాగా, పవన్ గతంలో వాలంటీర్లను కించపరిచేలా వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపైనే తాజాగా నాదెండ్ల స్పందించారు.
ఇదీ జరిగింది
గత ఏడాది జులై 9న ఏలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం తెలిసిందన్నారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళ అదృశ్యం వెనుక వాలంటీర్ల పాత్ర ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంత మంది సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ అప్పట్లో వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వాటిలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేసింది.
ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా పని చేస్తున్నారని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పవన్ వ్యాఖ్యలున్నాయని ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లేలా పవన్ మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. అంతకు ముందు జులై 20న పవన్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు 20న ఉత్తర్వులిచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీరు బి.పవన్‌కుమార్‌తో పాటు మరికొంత మంది ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్చి 25న విచారణ
పవన్ పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు దాఖలు చేయగా.. జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులిచ్చారు.
Also Read: Ganta Srinivasa Rao comments: జగన్‌కి బై బై చెప్పాలి, విశాఖ రక్షించుకోవాలి: మాజీ మంత్రి గంటా