YSRCP Amaravati : రాజధాని పద్మవ్యూహంలో వైఎస్ఆర్‌సీపీ - కావాలనే ఇరుక్కుందా ? బయటకు వచ్చే మార్గముందా ?
ప్రజలకు మూడురాజధానుల మాట !ఇన్వెస్టర్లకు ఒకే రాజధాని మాట !ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలుద్వంద్వ ప్రమాణాలతో వైసీపీ రాజకీయం వైఎస్ఆర్‌సీపీ రాజధాని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిందా ?
YSRCP Amaravati : వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలతో ఇటీవలి కాలంలో వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటోంది. పరిష్కరించలేని విధంగా సమస్యలు సృష్టించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలతో ఎదురుదాడి చేయాలనుకుని ఆ ఇష్యూను మరింత పెచుకోవడంతో పాటు తాజాగా రాజధాని అంశంపై నిలకడలేని ప్రకటనలు చేస్తూ ప్రజల్లోనూ ఓ రకమైన గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పడుతున్న పరిణామాలతో మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు జరిగే పనేనా అనే అనుమానానికి రావడంతో పాటు.. వైఎస్ఆర్‌సీపీపై నమ్మకం కోల్పోయే రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. ఇదంతా వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రణాళిక లేకుండా చేసుకున్న పనేనన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.
ఒకే రాజధాని అంటే రాయలసీమ వాసులు ఆగ్రహం చెందరా ?
కర్నూలును న్యాయరాజధాని చేస్తున్నామని ప్రభుత్వం ఆశలు రేపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసింది. చివరికి ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని.. అలా అని రాజధాని అని అనలేమని.. సాక్షాత్తూ కర్నూలుకే చెందిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఆయనే ఇలా ప్రకటించడంతో కర్నూలు వాసుల్లో ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ చెప్పింది ఏమిటి.. ఇప్పుడు చేస్తుంది ఏమిటన్న నిర్వేదం వారిలో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో రాయలసీమకు హైకోర్టు ద్వారా న్యాయం చేస్తామని.. రాజధాని అంటే.. హైదరాబాద్ లా అభివృద్ధి చెందుతుందని చెబుతూ వస్తున్నారు. చివరికి అది తేలిపోయింది. పైగా విశాఖ రాజధాని అంటే.. సీమ వాసులకు తీవ్ర నష్టం జరుగుతుంది. హైదరాబాద్ కన్నా వారికి విశాఖ రెట్టింపు దూరం అవుతుంది. ఈ రాజధానిని వారు అంగీకరించే అవకాశం ఉండదు.
బయట పడకపోయినా కోస్తా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండదా ?
అమరావతి రాజధాని కావాలని కోస్తా ప్రజలు ఉద్యమాలు చేయలేదు. ఆ మాటకు వస్తే.. ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ వచ్చినప్పుడు.. మా ప్రాంతానికే రాజధాని కావాలని ఎక్కడా ఉద్యమాలు జరగలేదు. ప్రభుత్వం రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ధింక్ బిగ్ అన్నట్లుగా రాజధాని నిర్మాణానికి ప్రయత్నించింది. అప్పట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు కోస్తా ప్రజలకే అన్నీ ఇస్తున్నారన్నట్లుగా రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ విమర్శలు చేసి.. ఆ ప్రాంతంపై కనిపించని వ్యతిరేకత కనబరుస్తూంటే.. ప్రజల్లో అసంతృప్తి లేకుండా ఉంటుందని ఊహించలేమని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పుడు విశాఖే రాజదాని అనే ప్రకటనతో కోస్తా ప్రజల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది.
విశాఖలో అయినా సానుకూలత వస్తుందా ?
ఏపీ ప్రభుత్వం రాజధానిని వివాదాస్పదం చేసింది. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదు.కానీ ప్రభుత్వం అక్కడ రాజధాని పెడితే ప్రపంచ స్థాయి నగరం అవుతుందని చెబుతున్నారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. సీఎం స్థానంలో ఉండి.. అలాంటివేమీ పట్టించుకోనని.. తానతు స్వయంగా విశాఖ వచ్చి పాలన చేస్తానని చెబుతున్నారు. దీని వల్ల విశాఖకు రాజధాని వచ్చినా అది చట్టబద్ధం కాదని.. ప్రజాస్వామ్య పాలనలో దీన్ని ఎలా అంగీకరించాలన్న వాదన ప్రజల్లో ఉంటుంది.
అటు ప్రజల్లో.. ఇటు ఇన్వెస్టర్లలోనూ నమ్మకం పోయే అవకాశం !
ఓ వైపు ఇన్వెస్టర్లకు ఒకే రాజధాని అని చెబుతూ.. మరో వైపు ప్రజలకు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా వైసీపీ రాజకీయ లాభం పొందాలని అనుకుంటుందేమో కానీ.. వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అటు రాజకీయ లాభం కలగకపోగా.. ఇటు ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది ఒకటనే అభిప్రాయానికి వస్తారు.