Ilayathalapathy Vijay Meet PK : ప్రశాంత్ కిషోర్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ! ఇది సినిమా కాదు రాజకీయం
హైదరాబాద్‌లో ఇళయదళపతి విజయ్ తో ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీ ప్రారంభంపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సై అంటే అందరూ ఆయన స్ట్రాటజీతో కిరీటాలు సంపాదించుకోవాలని ఎదురు చూస్తూంటారు. ఈ ఆశావహుల జాబితాలో తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ కూడా చేరారు. టీఆర్ఎస్‌కు వ్యూహలు రూపొందించే పనిలో హైదరాబాద్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను.. చెన్నై నుంచి ప్రత్యేకంగా వచ్చి మరీ ఇళయదళపతి విజయ్ సమావేశమయ్యారు. వీరి మీటింగ్ రహస్యంగానే జరిగినా... విషయం మాత్రం బయటకు వచ్చింది. రాజకీయ ఆకాంక్షలు మెండుగా ఉన్న విజయ్.. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని.. అందుకోసం పీకే సేవలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారని తమిళనాట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరిగాయి. విజయ్ అభిమాన సంఘాలు ప్రత్యేకంగా ఎన్నికల్లో పోటీ చేశాయి. విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన పలువురిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించారు అక్కడి ప్రజలు. నిజానికి అభిమానులు పోటీ చేస్తే తనకు సంబంధం లేదని.. వారిని పోటీ చేయకుండా ఆపనని విజయ్ ప్రకటించారు. విజయ్ అభిమాన సంఘం పేరు దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ (TVMI). ఈ సంఘం పేరు మీద 169సీట్లలో పోటీ చేసి 115చోట్ల గెలుపొందారు విజయ్ అభిమానులు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో విజయ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయం సాధించారు.
తమిళనాడులో ప్రస్తుతం పొలిటికల్ వాక్యూమ్ ఉంది.అక్కడి రాజకీయాల్లో స్టాలిన్‌ను తట్టుకుని నిలబడాలంటే ఆయన స్థాయిలో ఇమేజ్ ఉన్న నేతలు కావాలి. అన్నాడీఎంకేలో అలాంటి వారు లేరు. ఇప్పుడు ఆ ప్లేస్‌ను భర్తీ చేయడానికి విజయ్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా గతంలోనే విజయ్ తండ్రి రిజిస్టర్ చేయించారు. అయితే తనకు తెలియకుండా చేయించారని విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభ సహా 11 మంది నోటీసులు ఇచ్చారు. అయితే ్దే పేరు మీద స్థానిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేందుకు విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇలయదళపతి కూడా పార్టీ పెట్టి రేసులోకి వస్తారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. విజయ్‌కు రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. ఆయన జల్లికట్టు కోసం పోరాడారు. అలాగే స్టెరిలైట్ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఆయనపై గతంలో ఐటీ దాడులు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ కావడంతో.. ఇక ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారన్న అభిప్రాయం తమిళనాడులో బలంగా వినిపిస్తోంది. అయితే మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ప్రశాంత్ కిషోర్ పని చేశారు.ఈ సారి విజయ్‌కు పని చేస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గానే ఉంది.