తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయి? తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి?
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలు వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సామాజిక న్యాయ పోరాటం, రాజకీయ నేతలలో ఉన్న సంకల్పం, చట్టపరమైన వ్యూహాలను వారు అనుసరించడం వల్ల 50 శాతం మించి రిజర్వేషన్లు సాధ్యమైంది

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. న్యాయస్థానాల ముందు ఈ విషయంలో పోరాడాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు కారణం, ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానమైనది. రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీలు లేదు అని ఆ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్ల అమలును మోకాలొడ్డుతోంది. అయితే, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం 50 శాతం మించి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? అయితే, ఈ కథనం పూర్తిగా చదవండి.
తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇలా..
1. తమిళనాడులో ప్రస్తుతం 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
2. వెనుకబడిన తరగతులు (Backward Classes - BC) - 30%
(దీనిలో బీసీ ముస్లింలకు 3.5% అంతర్గత రిజర్వేషన్ ఉంది)
3. అత్యంత వెనుకబడిన తరగతులు/డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (Most Backward Classes / Denotified Communities - MBC/DNC) - 20%
4. షెడ్యూల్డ్ కులాలు (Scheduled Castes - SC) - 18%
5. షెడ్యూల్డ్ తెగలు (Scheduled Tribes - ST) - 1%
మొత్తం రిజర్వేషన్లు - 69%
తమిళనాడులో 50 శాతం రిజర్వేషన్లు మించి ఎలా ఇస్తోంది?
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలు వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అక్కడి సామాజిక న్యాయ పోరాటం, అక్కడి రాజకీయ నేతలలో ఉన్న సంకల్పం, చట్టపరమైన వ్యూహాలను వారు అనుసరించడం వల్ల 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైంది. ఈ పూర్వాపరాల్లోకి వెళితే, తమిళనాడుపై ద్రవిడ ఉద్యమ ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ రిజర్వేషన్ల డిమాండ్ చరిత్ర 1920ల నుంచి ఉంది. దీని లక్ష్యం ఒక్కటే: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించడం.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్రాస్ రాష్ట్రంలో రిజర్వేషన్లు క్రమక్రమంగా పెరగడం ప్రారంభించాయి. 1971ల నాటికి అప్పటి డీఎంకే ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి ఒక్కసారిగా 31 శాతానికి పెంచింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 16 నుంచి 18 శాతానికి పెంచింది. దీంతో 1971ల నాటికి తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు 49 శాతానికి చేరాయి. ఆ తర్వాత 1980ల నాటికి ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 31 శాతం నుంచి 50 శాతానికి పెంచడం జరిగింది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీల మొత్తం రిజర్వేషన్ల శాతం 68 శాతానికి చేరింది. ఆ తర్వాత 1989లో డీఎంకే ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేకంగా మరో 1 శాతం రిజర్వేషన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది .( అంతకు ముందు ఎస్సీ,ఎస్టీలకు కలిపి రిజర్వేషన్లు ఉండేవి) ఇలా తమిళనాడులో రిజర్వేషన్ శాతం 69 శాతానికి చేరింది.
పరిమితి దాటిన తమిళనాడు రిజర్వేషన్లకు న్యాయపరమైన సవాల్
అప్పటి వరకు 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోన్న తమిళనాడు ప్రభుత్వానికి, 1992లో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (మండల్ కేసు) లో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అరుదైన, అసాధారణ పరిస్థితుల్లో తప్ప దేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని తీర్పులో పేర్కొంది. ఇది తమిళనాడులో అప్పటికే అమలు అవుతున్న 69 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. అయితే, 69 శాతం రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేసేందుకు తమిళనాడు రాజకీయ నేతలు రాజకీయ చతురతను ప్రదర్శించారు. నాటి తమిళనాడు సీఎం జయలలిత వ్యూహాత్మకమైన తీరులో వ్యవహరించింది.
చట్టపరంగా, రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన జయలలిత
ఇందిరా సాహ్నీ కేసు తీర్పుతో తమిళనాడు రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయి. దీంతో జయలలిత ప్రభుత్వం తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని తెచ్చింది. 1994 తమిళనాడు శాసన సభలో చట్టం - 45 ను ఆమోదించింది. ఈ చట్టం రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 69 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత 69 శాతం రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ రక్షణ కల్పించే దిశగా అడుగులు వేసింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో 69 శాతం రిజర్వేషన్ల అమలును జయలలిత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంతో చేర్పించగలిగింది. ఇందుకు 1994లో 76వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో 69 శాతం తమిళనాడు రిజర్వేషన్ల అంశాన్ని చేర్చడం జరిగింది. ఈ షెడ్యూల్‌లో చేరిన చట్టాలపై న్యాయస్థానాలు సమీక్షించలేవు. ఇలా తమిళనాడు రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించబడింది. ఈ కారణంగా, రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటకూడదని సుప్రీం తీర్పు ఇచ్చినప్పటికీ, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.
రాజ్యాంగ సవరణకు రాజకీయ బేరసారాలు
రాజకీయ బేరసారాలు: ఈ రాజ్యాంగ సవరణను చేయించడానికి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత, కేంద్రంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారు. తమిళనాడులో కాంగ్రెస్-ఏఐఏడీఎంకే కూటమి బలమైనదికావడంతో, ఈ రాజ్యాంగ సవరణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వక తప్పలేదు. రాజకీయ అనివార్యత కారణంగానే 1994లో 76వ రాజ్యాంగ సవరణ చేసి తమిళనాడు రిజర్వేషన్ చట్టం (Tamil Nadu Act No. 45 of 1994) ను 9వ షెడ్యూల్‌లో చేర్చడం జరిగింది.
జయలలిత ఒత్తిడికి తలొగ్గిన పీవీ: 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - అన్నాడీఎంకే తమిళనాడులో పొత్తు పెట్టుకుని అద్భుత ఫలితాలను సాధించాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు పార్లమెంట్‌లో తన ప్రభుత్వ మెజార్టీ కోసం అన్నాడీఎంకే మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఏ మాత్రం జయలలిత కినుక వహించినా పీవీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. ఈ కారణంతో తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జయలలిత పీవీపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ కారణంతో పీవీ నరసింహారావు ప్రభుత్వం జయలలిత ఒత్తిడి మేరకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టానికి 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా రాజ్యాంగ రక్షణ కల్పించింది. అంతే కాకుండా, తమిళనాడు ద్రవిడ ఉద్యమంతో ముడిపడి ఉన్న రిజర్వేషన్ విధానం. ఇది చాలా కాలం నుంచి అమల్లో ఉంది. దీనికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఆ రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఉద్యమం చెలరేగవచ్చు అన్న భావనతో కేంద్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చక తప్పలేదు.






















