Gujarat Election 2022: రూ.500కే సిలిండర్, ఫ్రీ కరెంటు- గుజరాత్‌లో రాహుల్ హామీలు
Gujarat Election 2022: రానున్న గుజరాత్ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రస్తుతం అక్కడ పర్యటించిన రాహుల్ గాంధీ భారీ వరాలు ప్రకటించారు.
Gujarat Election 2022: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని సాధారణ ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ప్రకటించారు. ముంద్రా విమానాశ్రయంలో డ్రగ్స్ స్వాధీనంపైనా అధికార బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్ డ్రగ్స్ కేంద్రంగా మారిందని అన్నారు.
అహ్మదాబాద్ లో బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు.
"రైతులకు ఉచితంగా కరెంటు"
సర్దార్ పటేల్ రైతుల గొంతుకగా నిలిచారని అన్న రాహుల్ గాంధీ.. ఒక వైపు బీజేపీ ఆయన ఎత్తైన విగ్రహాన్ని తయారు చేస్తూనే మరో వైపు ఆయన ఎవరి కోసం పోరాడారో.. వారికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని రాహుల్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొవిడ్ -19 మహమ్మారి సమయంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడంతోపాటు నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
"డ్రగ్స్ కేంద్రంగా గుజరాత్"
ముంద్రా ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్వాధీనంపై అధికార బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. గుజరాత్ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. డ్రగ్స్ అన్నీ ముంద్రా పోర్టు నుంచి తరలిస్తారు కానీ గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ఇది గుజరాత్ మోడలా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బీజేపీ పాలనలోని గుజరాత్ రాష్ట్రంలో నిరసన చేసే హక్కు కూడా లేదని ఆయన ఆరోపించారు. నిరసన చేసే ముందు అనుమతి తీసుకోవాలని చెప్పడం దారుణమని అన్నారు. ఎవరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారో వారి నుండి అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.
"సెప్టెంబర్ 7 నుండి భారత్ జోడో యాత్ర"
తాను నిరుద్యోగాన్ని అంతం చేయాలని అనుకుంటున్నానని, గుజరాత్ రాష్ట్రంలో 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించనున్న పార్టీ భారత్ జోడో యాత్రకు రెండు రోజుల ముందు రాహుల్ గాంధీ పర్యటన గుజరాత్‌లో సాగింది. చివరిసారిగా మే 10న దాహోద్ పట్టణంలో గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో సందర్శించారు.
గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ మూడు నెలల సుదీర్ఘ ప్రచారాన్ని సిద్దం చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ ఇద్దరూ గుజరాత్ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటారను పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు.