BJP Janasena : బీజేపీకి కటీఫ్ చెప్పడానికే పవన్ మొగ్గు - టీడీపీతో వెళ్లాలనే నిర్ణయించుకున్నారా ? వైఎస్ఆర్‌సీపీ ట్రాప్‌లో పడ్డారా ?
బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ వ్యూహం మార్చుకుంటున్నట్లుగా ప్రకటించారు. టీడీపీతో వెళ్లాలనే నిర్ణయించుకున్నారా ? వైఎస్ఆర్‌సీపీ వాదనే నిజమని నిరూపిస్తున్నారా ?
BJP Janasena : భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని గౌరవిస్తాం.. ఊడిగం చేయలేమని ఒక్క మాట ద్వారా ఆ పార్టీతో దూరం జరగబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. బీజేపీతో అలయెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్కడో సరిగా లేదనే భావన కనపడుతోందని... ఆ విషయం తమకు తెలుసు, బీజేపీ నాయకత్వానికి కూడా తెలుసని పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి వెళ్లడానికే రోడ్ మ్యాప్ అడిగానని... వారు మ్యాప్ ఇవ్వక పోవడం వల్ల తనకు సమయం గడిచిపోతుందని చెప్పారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని... అయితే రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే... ప్రజలను కాపాడుకోవడానికి తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు. అంటే పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం మార్చుకున్నారని తేలిపోయింది.
బీజేపీ రోడ్ మ్యాప్ ఆలస్యమవుతోందన్న పవన్
ప్రధాని మోదీకి కానీ, బీజేపీకి కానీ తాను వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీని ఎప్పుడూ గౌరవిస్తామని... అలాగని ఊడిగం చేయలేమని చెప్పారు. వైసీపీ ముక్త ఏపీ కోసం .. పని చేస్తానని .. ఓట్లు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. ఓట్లు చీలనివ్వకపోవడం అంటే.. టీడీపీతో కలవడమేనని రాజకీయవర్గాలు విశ్లేషించాయి. ప్రధాన పోటీ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య జరుగుతుంది. జనసేన పార్టీ కూడా ఓట్లు పొందుతుంది. దీని వల్ల జయాపజయాలు మారిపోతాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా... చూడాలని పవన్ నిర్ణియంచుకున్నారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన పవన్ .. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.
పొత్తులో ఉన్నా ఎవరికి వారే అన్నట్లుగా బీజేపీ - జనసేన
ఎలాంటి ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రెండు పార్టీలూ కలసి పని చేయలేకపోయాయి. ప్రత్యేకంగా ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నారు. కానీ ముందుకు సాగలేదు. తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ చేయాలనుకున్నా.. బీజేపీనే పోటీ చేసింది. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయంలోనూ బీజేపీ వెనుకడుగు వేసింది. అలా ప్రకటించే చాన్స్ లేదని చెప్పేశారు. దీంతో పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికులకూ బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న అభిప్రాయం బలపడింది.
టీడీపీ - జనసేన ఒక్కటేనని వాదిస్తున్న వైఎస్ఆర్‌సీపీ !
కొద్ది రోజులుగా టీడీపీ - జనసేన ఒక్కటేనని వైఎస్ఆర్‌సీపీ వాదిస్తోంది. చంద్రబాబు చెప్పినట్లే పవన్ చేస్తారని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే పద్దతిలో పవన్ కల్యాణ్.. బీజేపీ వల్ల ప్రయోజనం లేదని వ్యూహం మార్చుకుంటానని చెప్పడం ద్వారా .. వైఎస్ఆర్‌సీపీ చేస్తున్న వాదన నిజమేనని పవన్ అంగీకరించినట్లు అవుతుంది. ఇదే అంశాన్ని వైఎస్ఆర్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.