Ponguleti : పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
Telangana : తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు రాజకీయంగానూ పెను సంచలనం అవుతున్నాయి. ఈ దాడుల వెనకు బీజేపీ దీర్ఖకాలిక వ్యూహం ఉందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
ED attacks on Telangana Minister Ponguleti : తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ తర్వాత ఎక్కువ పనులు ఆయనే చక్క బెడుతున్నారు. అలాంటి కీలక పొజిషన్లో ఉన్న ఆయనపై ఈడీ ఒక్క సారిగా ఎటాక్ చేసింది. ఆయన ఆర్థిక మూలాల నుంచి పరిశోధించి అక్రమాలను వెలికి తీసేందుకు భారీ కసరత్తు చేసి మరీ బరిలోకి దిగింది. ఏం కనిపెట్టారన్నది బయటకు తెలియడానికి సమయం పడుతుంది. ఈ దాడుల వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయి ఇలా దాడులు చేయిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. రాజకీయం మాత్రం ఉందని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలతో పాటు ఇతరులు కూడా నమ్ముతున్నారు.
కర్ణాటక తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయబోతున్నారా ?
కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రిస్క్‌లో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్తలో కేసు నమోదయింది. గవర్నర్ అనుమతితోనే ఇదంతా జరిగింది. ఇక్కడ ఇంకా అక్కడి వరకూ రాలేదు కానీ పొంగులేటిపై ఐటీ దాడులు ఆ కసరత్తుకు ప్రారంభం అని అనుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి ఆర్థిక బంధాలు ఎంతో విస్తృతంగా ఉంటాయి. ఆయన వ్యాపారం రాజకీయంతో కలిసిపోయి ఉంటుంది. అంత స్వచ్చంగా వ్యాపారాలు నిర్వహించలేరు. ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. బీజేపీకి ఆయనను తన దారిలోకి తెచ్చుకోవడానికి అది సరిపోతుంది. నిజంగా అలాంటి వ్యూహం ఉంటే మాత్రం పొంగులేటికి కూడా మరో దారి ఉండదు.
పొంగులేటి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం - రెండు కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లిన అధికారులు!
పొంగులేటి పై తరచూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసే బీఆర్ెస్
పొంగులేటి బలమైన నాయకుడు. ఆయన ఖమ్మంలో అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఆయనకంటూ.. ఓ ఆరేడుగురు ఎమ్మెల్యేల బలం ఉంటుందని అంచనాలు ఉన్నాయి . అందుకే కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం అధికారంలో ఉండదని బీఆర్ఎస్ నేతలు తరచూ హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదని ఖమ్మం, నల్లగొండ నుంచి రెండు అణుబాంబులు ఉన్నాయని అవి పేలితే ప్రభుత్వం ఉండదని సెటైర్లు వేస్తూ వస్తున్నారు. ఆ బాంబాబు పొంగులేటి, కోమటిరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వీరిద్దరూ.. తమ మాటల్లో ఎప్పుడూ అసంతృప్తిని బయట పెట్టలేదు. రేవంత్ కు విధేయంగా ఉంటూనే వస్తున్నారు.
'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
కాంగ్రెస్ ప్రభుత్వాల్ని బలహీనం చేసే ప్లాన్‌లో బీజేపీ ?
కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. తమిళనాడు వంటి చోట్ల మిత్రపక్షాలతో అధికారంలో ఉంది. కానీ నేరుగా అధికారంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లో మాత్రమే. ఆ మూడు రాష్ట్రాల్లో హిమచల్ ప్రదేశ్ లో గతంలో చావు తప్పి కన్నులొట్టబోయిన రీతిలో ప్రభుత్వాన్ని పోగొట్టుకుని మళ్లీ బతికించుకుంది . కర్ణాటక సర్కార్ పరిస్థితి గందరగోళంలో పడింది తెలంగాణలోనూ అలాంటి ఎపెక్ట్ కోసం పొంగులేటి నుంచి వ్యూహం అమలు ప్రారంభించారని..కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఏదో చేస్తున్నాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. అదే నిజమైతే తెలంగాణలో ఎవరూ ఊహించని అనూహ్యమైన రాజకీయం జరగడం ఖాయం.