Glass Symbol : ఫ్రీ సింబల్ కేటగిరిలో గాజు గ్లాస్ - కూటమికి సమస్యలు తప్పవా ?
Andhra Politics : ఫ్రీ సింబల్ కేటగిరిలో జనసేన గుర్తు గాజు గ్లాస్ ను ఈసీ చేర్చింది. దీని వల్ల కూటమి ఎదుర్కోబోయే సమస్యలు ఏమిటంటే ?
EC has included the Janasena symbol glass in the free symbol category : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన బీజేపీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి దక్కిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ జోరు పెంచారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి కూటమి మద్దతుతో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి షాక్ తగిలినట్లయింది.
ఫ్రీ సింబల్ కేటగిరిలో గాజు గ్లాస్
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీ సీఈవో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీలు ఉన్నాయి. రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తును ఈసీ ప్రకటించింది. జనసేన గ్లాసు గుర్తు మాత్రం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. రాజకీయ పార్టీలు సాధించిన ఓటింగ్ శాతంనుబట్టి ఎన్నికల సంఘం పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ శాతం సాధించలేని పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలుగానే మిగిలిపోతాయి. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.
జనసేన కు వచ్చిన ఇబ్బందేమీ లేదు !
జనసేన పార్టీకి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంటే.. జనసేన గుర్తు విషయంలో ఎలాంటి సమస్యా లేదు. జనసేన పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ ఫ్రీ సింబల్. అంటే జనసేన పోటీ చేయని 154 స్థానాల్లో పోటీ చేసే ఇండిపెండెంట్లకి ఫ్రీ సింబల్ గా జనసేన గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తారు. అభ్యర్థులు కోరుకున్నదాన్ని బట్టి కేటాయిస్తారు. అయితే ఏపీలోని రాజకీయ పరిణామాలతో వైసీపీ మద్దతు దారులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి.. గాజు గ్లాస్ గుర్తు తీసుకుని ప్రచారం చేసే అవకాశం ఉంది.
గతంలో ఏం జరిగింది ?
జనసేన, బీజేపీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అప్పుడు అధికారికంగా బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. జనసేన పార్టీ పోటీ చేయడం లేదు కాబట్టి ఆ పార్టీ గుర్తు లేదు. కానీ నవతరం అనే పార్టీ తరపున పోటీ చేసిన గోడ రమేష్ అనే వ్యక్తి.. తనకు గాజు గ్లాస్ గుర్తు కావాలని పట్టుబట్టి తీసుకున్నారు. అయితే ఆయనకు నాలుగు వేల ఓట్లు మాత్రమే వచ్చింది. ఇవి మొత్తం ఓట్లలో 0.3 శాతం కూడా కాదు. గుర్తులపై ప్రజలు స్పష్టతతో ఉంటారని.. జనసేన పోటీ లేకపోయినా గాజు గ్లాస్ గుర్తు ఉందని ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయినా … ఓ వంద ఓట్లు అయినా అలా డైవర్ట్ అయితే.. ఇబ్బందికరం కాబట్టి ఈసీకి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.