Kothagudem: డీహెచ్ శ్రీనివాస్ ఆశలు గల్లంతైనట్లేనా? అందుకే కొత్తగూడెంలో దూకుడు తగ్గిందా?
Khammam జిల్లాకు చెందిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు వనమా రాఘవ ఉదంతం అనంతరం ప్రధానంగా కొత్తగూడెం పైనే ఫోకస్ చేశారు.
కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో పోటీ చేయలనే ఉద్దేశ్యంతో ఇక్కడే క్యాంప్ చేసి హడావుడి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఇటీవల పర్యటనలు లేకపోవడంతో ఆయన వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. రాజకీయాలపై ఆసక్తితో సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసిన గడల కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తాడని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు కొత్తగూడెంపైనే ప్రధానంగా ఫోకస్ చేసిన గడల ఇటీవల కాలంలో పర్యటనలు నిలిచిపోవడం వెనుక వెనకంజ వేయడమేనని తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు వనమా రాఘవ ఉదంతం అనంతరం ప్రధానంగా కొత్తగూడెంపైనే ఫోకస్ చేశారు. ఇక్కడ్నుంచే సేవా కార్యక్రమాలు చేశారు. నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచలో హెల్త్ క్యాంప్‌లు పెడుతూ ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేశారు. సాక్షాత్తు హెల్త్ డైరెక్టర్ కార్పోరేట్ ఆసుపత్రుల సౌజన్యంతో హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చ జరిగింది. అయితే శ్రీనివాసరావుకు చెందిన ఓ బృందం తరచూ ఇక్కడ పర్యటన చేస్తూ రానున్న ఎన్నికల్లో ఇక్కడ్నుంచే ఆయన పోటీ చేస్తారని, అందుకు సహకరించాని ద్వితీయ శ్రేణి నాయకులను కలవడం కూడా కొత్తగూడెం రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతోపాటు శ్రీనివాసరావుకు చెందిన జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా క్యాంప్ ఆపీస్‌ను ఏర్పాటు చేసి స్థానికంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
గిరిజన ప్రజాప్రతినిధితో పూజలు వైరల్..
స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బాగంగా సుజాతనగర్ ఎంపీపీ వద్దకు వెళ్లడం, అక్కడ పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చివరకు ఆయనే స్వయంగా ఈ విషయంపై మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పాల్వంచలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన శ్రీనివాసరావు ఆ తర్వాత నియోజకవర్గంపై అంతగా ఫోకస్ చేయకపోవడం గమనార్హం.
కొత్తగూడెం టిక్కెట్ కేటాయింపు సీపీఐకు కేటాయిస్తారని ప్రచారం కావడం, మాజీ ఎంపీ పొంగులేటికి టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు నెలల కాలంగా జీఎస్‌ఆర్ మాత్రం కొత్తగూడెం వైపునకు రాకపోవడం వెనుక టిక్కెట్‌పై స్పష్టత లేకపోవడంతోనే అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గత రెండు నెలల క్రితం వరకు కొత్తగూడెంలో సుడిగాలి పర్యటనలు చేసిన జీఎస్సార్, ఆయన మిత్రబృందం ఇప్పుడు సైలెంట్ అవడం వెనుక మాత్రం టీఆర్‌ఎస్ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.