Janasena Politics : టీడీపీతో పొత్తు ఖాయం - బీజేపీని కలిపేందుకూ ప్రయత్నం ! పవన్‌కు బీజేపీ ఎం చెప్పింది ?
టీడీపీతో కలిసి రావాలని పవన్ బీజేపీని కోరారా ?బీజేపీ ఏం సమాధానం చెప్పింది ?2014 కూటమి మళ్లీ రెడీ అవుతుందా ?పవన్ ప్రయత్నాల ఫలితం ఎలా ఉంటుంది ?
Janasena Politics : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు. ఓట్లు చీలనివ్వబోమన్న తమ వ్యూహాన్ని నొక్కి చెప్పారు. అదే సమయంలో కలసి రావాలని బీజేపీని కోరడానికే ఢిల్లీ వెళ్లానని పవన్ కల్యాణ్ తొలి సారి నేరుగా చెప్పారు. అక్కడ బీజేపీ స్పందన ఏమిటన్నది మాత్రం పవన్ కల్యాణ్ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కలసి వస్తుందా ? అసలు పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై బీజేపీ అగ్రనేతలు ఏమన్నారు ? ఏపీ రాజకీయాలపై వారిలో ఎలాంటి చర్చ జరుగుతోంది ?
2014 కూటమి కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2014లో పార్టీ పెట్టారు. అయితే పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయడం కన్నా ఎన్డీఏలో చేరి.. మద్దతు ఇవ్వడం మంచిదనుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా తీసుకోలేదు. ఎన్డీఏ గెలిచింది. కేంద్రంలో , రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. కేంద్రంలో టీడీపీ నేతలు మంత్రి పదవులు తీసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు తీసుకున్నారు. కానీ జనసేన పార్టీ మాత్రం పదవులకు దూరంగా ఉంది. ఎమ్మెల్యే , గవర్నర్ కోటా వంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ వంటి సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చినప్పటికీ జనసేనాని పదవులు తీసుకోవడానికి నిరాకరించారు. 2019 ఎన్నికల్లో తన బలం ఎంతో తేల్చకోవాలని ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు వైసీపీని ఓడించడానికి మరోసారి 2014 కూటమి రావాలని కోరుకుంటున్నారు.
టీడీపీతో వెళ్లడానికి జనసేన రెడీ - బీజేపీకీ ఆహ్వానం!
నిజానికి పవన్ కల్యాణ్..బీజేపీతో అధికారిక పొత్తులో ఉన్నారు. ఏపీలో జనసేన, బీజేపీ మిత్రపక్షాలు. రాజకీయంగా కలిసి పని చేయడం లేదు. కానీ సాంకేతికంగా రెండు పార్టీలు పొత్తులో ఉన్న పార్టీలు. ఇప్పుడు కలుపుకోవాల్సింది టీడీపీనే. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తాము టీడీపీతో వెళ్తామని బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నారు. బీజేపీ, జనసేన పొత్తు వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. తిరుపతి ఉపఎన్నికల్లో క్లారిటీ వచ్చింది. ఇద్దరూ కలిసి పని చేయడం వల్ల ఓట్ల చీలిక పెరుగుతుంది తప్ప.. ఓట్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ కలిస్తేనే.. ప్రత్యామ్నాయ కూటమి సిద్ధమవుతుంది. అందుకే పవన్ టీడీపీతో కలిసి రావాలని బీజేపీని కోరుతున్నారు.
ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని చంద్రబాబు సంకేతాలు !
ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చినట్లయింది. ఎన్డీఏలో చేరుతామా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు. అమిత్ షాను నారా లోకేష్ ఓ సారి రహస్యంగా కలిశారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఆ తర్వాత డెవలప్‌మెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు పవన్ ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
బీజేపీ స్పందన ఎలా ఉండబోతోంది ?
టీడీపీతో మళ్లీ కలిసే అంశంలో బీజేపీ స్పందన ఎలా ఉండబోతోందనేది కీలకం. ఎందుకంటే ఏపీలో వైసీపీ నేతలు ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఢిల్లీలో ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రం కోసం డిమాండ్ల పేరుతో వారిని ఇబ్బంది పెట్టడం లేదు. కొన్ని అప్పులు ఇస్తే చాలని సర్దుకుంటున్నారు. అందుకే కేంద్రం వైసీపీ విషయంలో సానుకూలంగా ఉందని చెబుతున్నారు. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్.. కలిసి వస్తే రావాలి లేకపోతే వైసీపీ విముక్త ఏపీ కోసం టీడీపీతో వెళ్తామని తేల్చేయడంతో ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.