Warangal Congress : మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
Telangana: జిల్లాకో ఏజెండాతో పార్టీని బలపర్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. నల్లగొండ జిల్లాలో మూసి సెంటిమెంట్.. వరంగల్‌లో రెండో రాజధాని వాదన వినిపిస్తున్నారు.
Telangana Congress party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా పార్టీని బలపర్చుకునే ప్రయత్నాలను వ్యూహాత్మకంగా చేస్తోంది. ఉమ్మడి జిల్లాను యూనిట్‌గ తీసుకుని ఒక్కో అజెండాతో రంగంలోకి దిగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల విషయంలో ఇప్పటికే ప్రత్యేకమైన వ్యూహాలని పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహం సక్సెస్ అయితే ఇతర రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా .. కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
వరంగల్ రెండో రాజధాని నినాదం !
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రెండో రాజధాని అనే కాన్సెప్ట్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదని.. తెలంగాణలో మరో మెట్రోసిటీగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని రెండో రాజధానిగా మారుస్తామని అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఈ మాట వచ్చింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎయిర్ పోర్టును కూడా పట్టాలెక్కిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల దూరం లోపే ఉన్నప్పటికీ రూల్స్ మార్పించుకుని మరీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించి... ప్రజలందరిలో ఉత్సాహం నింపినా ఆశ్చర్యం ఉండదు. అప్పటికే కొన్ని అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు సంతృప్తిగా ఫీలవుతారు. ఓట్లు రాలడానికి అంత కంటే కావాల్సిదేమీ ఉండదు.
నల్లగొండ జిల్లాపై మూసి అస్త్రం
మరో వైపు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాపై మూసి అస్త్రం ప్రయోగిస్తోంది. హైదరాబాద్‌లో మూసి ప్రక్షాళనను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని తద్వారా నల్లగొండ ప్రజలను విషం తాగమని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ నల్లగొండ సెంటిమెంట్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా చేస్తున్నారు. ప్రజలు కూడా మూసిని ప్రక్షాళన చేయకుండా తమను ఇబ్బంది పెడతారా అన్న ఆలోచనకు వచ్చేలా చేయగలిగితే కాంగ్రెస్ పంట పండినట్లే. కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో బలంగా ఉంది. మూసిని రాజకీయ అంశం చేసి సెంటిమెంట్ రేపితే ఇక తిరుగు ఉండదు. ఈ ఆలోచనతో విస్తృతంగా మూసి గురించి నల్లగొండలో ప్రచారం చేస్తున్నారు.
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
ఖమ్మం, వరంగల్, నల్లగొండలో టార్గెట్ !
తెలంగాణలో అధికారం అందాలంటే మూడు జిల్లాలు కీలకం. ఎన్నికల వరకూ వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో తేలిపోయింది. నల్లగొండలోనూ గతంలో మంచి ఫలితాలు సాధించారు. ఈ రెండు జిల్లాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన వ్యూహం అమలు చేస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండలో కలిపి ముఫ్పైకి పైగా అసెంబ్లీ సీట్లు ఉంటాయి. గ్రేటర్ పరిధిలో మరో ముఫ్పై సీట్లు ఉంటాయి. ఈ జిల్లాలను కాదని ఎన్నికలను ఈదే పరిస్థితి ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా మందుకు చూపుతో జిల్లాకో వ్యూహం అమలు చేస్తోంది. రేపు మరో జిల్లాపై మరో వ్యూహంతో ముందుకు రావొచ్చు. కాంగ్రెస్ రాజకీయానికి బీఆర్ఎస్స ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాల్సి ఉంది.