Congress Sharmila : హైకమాండ్ ఆదేశించిన చోట పోటీ - కడప కాంగ్రెస్ నేతలకు క్లారిటీ ఇచ్చిన షర్మిల
Andhra Congress : కడప జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం అయ్యారు. కడప నుంచి పోటీ చేయాలన్నారు.
Congress leaders asked YS Sharmila to contest from Kadapa : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. షర్మిల కడప ఎంపీగా ఎన్నికల బరిలో దిగుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని, తాను అయినా ఇతర ముఖ్య నాయకులు అయినా ఆదేశాలు పాటించాలని, అధిష్టానం ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధపడాలని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందరూ షర్మిల కడప నుంచి పోటీ చేయాలని కోరారు.
రాష్ట్రంలో సమస్యలపై సమాధానం చెప్పాలని సజ్జలకు కౌంటర్ ఇచ్చారు. మా కలలు పక్కన పెట్టి, మీరు ఏ కళలు కంటున్నారో చూడండంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమని, కడప ఎంపీగా ఉండి కూడా కడప స్టీల్ ప్లాంట్ పై ఎందుకు పోరాటం చేయలేదని ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. షర్మిల ఇప్పటి వరకూ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకోలేదు. అయితే పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు, నేతల్లో నూతనోత్సాహం నెలకొందని.. ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే పార్టీ పునరుజ్జీవానికి దోహదపడుతుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల ముంబైలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ.. కడప నుంచి లోక్‌సభకు పోటీచేయాలని షర్మిలకు సూచించారు. నాటి నుంచి దీనిపై ఆమె కసరత్తు చేస్తున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కడప నుంచి షర్మిల బరిలోకి దిగితే.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా..వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవనిభావిస్తున్నారు. ప్రతి రోజూ జగన్ పాలనను తూర్పారబట్టడంతోపాటు.. చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తుంటే దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.
అయితే కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల వివేకా వర్థంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేస్తారని అనుకున్నా చేయలేదు. ప్రజా తీర్పు కావాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో షర్మిల పోటీ చేస్తే.. సునీత కూడా ఆమెకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సునీతకు తాను పూర్తి స్థాయిలో అండగా నిలబడతానని ఇంతకు ముందే ప్రకటించారు.