YS Sharmila Targets Jagan: ఏపీలో షర్మిల యాక్టివ్ మోడ్.. వైసీపీకి తలనొప్పులు తప్పవా?
Ys Sharmila Comments: ఏపీ కాంగ్రెస్ ఛీప్‌గా షర్మిల రావడం, అన్నపై నేరుగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Ys Sharmila Comments On Jagan: ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ క్రియాశీలక పాత్రకు సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ నాయకుల్లో ఇప్పుడు నూతనోత్సాహం కనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం.. వైఎస్‌షర్మిల. ఆమెను పార్టీలోకి తీసుకుని పీసీసీ పగ్గాలను అధిష్ఠానం అప్పగించడంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న కేడర్ అంతా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. విభజన అనంతరం కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత 2014 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ ప్రజాతీర్పుతో ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయింది. బహుశా దేశ రాజకీయ చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ తర్వాత ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కించుకోకుండా ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం అదే తొలిసారి కావొచ్చు. ఆ దెబ్బతో కాంగ్రెస్ శ్రేణులు చెల్లా చెదురయ్యాయి. కొంతమంది వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలోకి వెళ్లగా.. మరికొంతమంది టీడీపీ చెంతకు చేరారు.
కాంగ్రెస్‌కు ప్రధాన బలమైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, వైఎస్ అభిమానులు వైసీపీ జెండా కిందకు చేరుకున్నారు. దాంతో ఆ పార్టీ బలోపేతమైంది. అదే సమయంలో కాంగ్రెస్ నిర్వీర్యమవుతూ వచ్చింది. మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ వంటి నేతలు పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో రఘువీరారెడ్డి అస్త్ర సన్యాసమే చేశారు. పార్టీ వ్యవహారాలు విడిచిపెట్టి సొంత ఊరిలో వ్యవసాయ, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటూ ఉండిపోయారు. దళిత సామాజిక వర్గానికి చెందిన శైలజానాథ్ కొన్నాళ్లు పార్టీని నడిపించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అమలాపురం ప్రాంతానికి చెందిన గిడుగు రుద్రరాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా పేరుకే ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఇప్పటికే ఏపీలో 2014, 2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌కు.. రానున్న ఎన్నికల్లోనూ అంతకుమించిన పరాభవం తప్పదనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో కొనసాగాయి. నోటాతో పోటీ పడాలేమోననే వ్యంగ్య వ్యాఖ్యానాలూ సోషల్ మీడియాలో కనిపించాయి.
మరోవైపు మూడేళ్ల క్రితం తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరిట రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించిన షర్మిల.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల్లో తప్పకుండా వైఎస్సాఆర్‌టీపీ పోటీ చేస్తుందని, కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ లక్ష్యమని చెప్పిన ఆమె.. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో ఆమె స్వరం మారింది. కాంగ్రెస్ పార్టీతో ఆమె రాయబారాలు నడపడం మొదలుపెట్టారు. అప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తర్వాత పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఇక వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమని.. అధికారిక ప్రకటనే తరువాయి అని అంతా భావించారు.
కానీ తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వర్గం షర్మిల రాకను వ్యతిరేకించింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైనట్లు ప్రచారం జరిగింది. దాంతో షర్మిల మళ్లీ కొన్నాళ్లు ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా కనిపించారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిగాయి. పార్టీలో చేరి ఏపీ బాధ్యతలు చేపట్టాలని.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే ప్రతిపాదనను ప్రధానంగా అధిష్ఠానం ఆమె ముందు ఉంచింది. అప్పటికే తెలంగాణలో పాదయాత్ర చేయడం.. వైఎస్సార్‌టీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు ప్రారంభించడంతో షర్మిల అంత త్వరగా అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత పలు దఫాలుగా జరిగిన చర్చలు సఫలీకృతం కావడంతో వైఎస్సార్‌టీపీ నేతలకు ఈ విషయాన్ని షర్మిల చేరవేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు బహిరంగంగానే ఆమె ప్రకటించారు. ఊహించినట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముందు అనుకున్న విధంగా ఏపీ పగ్గాలు చేపట్టేందుకు షర్మిల అంగీకారం తెలిపి పార్టీలో చేరారు. ఇలా.. ఏపీ కాంగ్రెస్‌కు దిక్సూచిలా కనిపించిన ఆమెకు రాష్ట్ర పగ్గాలను అధిష్ఠానం అప్పగించింది. ఏపీలో ఎన్నికలకు మరో రెండు నెలలే ఉన్న ఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం సానుకూల ప్రభావమే చూపించేలా కనిపిస్తోంది. తొలి నుంచీ కాంగ్రెస్ అభిమానులుగా ఉన్న వారు షర్మిల రాకతో యాక్టివ్ అయ్యారు. మరోవైపు వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులు కూడా ఆ పార్టీలో చేరే అవకాశముంది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల రాక ముఖ్యంగా వైసీపీకి ఇబ్బంది పెట్టేదిగా మారొచ్చు. ఆ పార్టీలోని వైఎస్ అభిమానులు తిరిగి కాంగ్రెస్‌లో చేరే వీలుంది.
విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక షర్మిల చేసిన ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకునేలా కనిపించింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి సమదూరం పాటిస్తున్నాననే సంకేతాలను ఆమె ఇచ్చారు. అయితే ఇంతవరకు ఏనాడూ తన అన్న సీఎం జగన్‌పై మాట్లాడని షర్మిల.. నేరుగానే ఆయన్ను టార్గెట్ చేశారు. ప్రధానంగా ప్రత్యేకహోదా అంశంలో జగన్ తీరును ఎండగట్టారు. ప్రతిపక్ష నేతగా ‘హోదా’పై విమర్శలు చేసిన జగన్.. సీఎం అయ్యాక ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు పార్టీలూ దొందూదొందేనని.. కేంద్రంలోని బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు వైసీపీకి బలమైన క్రిస్టియన్ ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. మణిపుర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఎందుకు బీజేపీని ప్రశ్నించలేదని నిలదీశారు. ముఖ్యంగా జగన్ ఓ క్రిస్టియన్‌గా ఉండి కూడా ఎందుకు మాట్లాడలేదంటూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. షర్మిల వాగ్దాటి, సొంత అన్నపైనే చేస్తున్న విమర్శనాస్త్రాలు భవిష్యత్‌లో వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read: ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడారా? చంద్రబాబువి 3D గ్రాఫిక్స్: వైఎస్ షర్మిల
Also Read: Sharmila Districts Tour: అన్న జగన్ కంటే ముందే జనంలోకి షర్మిల - రాజన్న బిడ్డ ఆట మొదలైంది!