2018 తర్వాత నుంచే పొంగులేటికి చెక్ పెడుతూ వచ్చిన కేసీఆర్! ఇప్పుడు టార్గెట్ ఏంటంటే?
పొంగులేటి వ్యవహార శైలితో తరుచూ ఖమ్మంలో వర్గపోరు ముదరడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని ముందస్తుగానే అమలు చేసినట్లు తెలుస్తోంది. భారీ జన సమీకరణ చేసి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ దేననే సంకేతాలు ఇవ్వనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు తెలంగాణలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 1న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వెనువెంటనే పొంగులేటికి సెక్యూరిటీ తగ్గించడంతో పొంగులేటి పార్టీ మారడం ఖాయమైంది. ఉద్యమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కేసీఆర్ అసలు వదులుకోరు. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను తన వ్యూహాలతో కారు ఎక్కించేస్తారు. ఇందుకు ఉదాహారణే నిజమాబాద్‌లో రాజకీయాలకు దూరంగా ఉంటున్న మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడమే.
ఇంత ముందు జాగ్రత్తతో ఉండే కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ప్రచారం సాగుతున్న పొంగులేటిని ఎందుకు పక్కన బెట్టారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలో చర్చ సాగుతుంది. ఇంతకీ పొంగులేటి బలమైన నాయకుడు కాకపోవడం వల్లేనా..? లేక పొంగులేటి బలాన్ని దశలవారీగా తగ్గించి ఆ తర్వాత పొమ్మనకుండా పొగబెట్టారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు బలంగా ఉండటంతోపాటు జగన్ క్రేజ్ వల్ల రాజకీయాల్లోకి రాగానే ప్రధాన నేతగా మారారు. ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతో 2014లో జరిగిన ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంపీగా గెలవడంతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ బావజాలం ఉవ్వెత్తున ఉన్న ఆ రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ విజయం సాధించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే అనతి కాలంలోనే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో అక్కడ ఉపఎన్నికలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగే సమయంలోనే అనూహ్యంగా పొంగులేటి గులాబీ కండువా కప్పుకోవడం చర్చానీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే అప్పట్నుంచి పొంగులేటికి కేసీఆర్ జిల్లా రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు.
2018 ఎన్నికల్లో తారుమారైన అంచనాలు..
2018 సాధారణ ఎన్నికల్లో పొంగులేటి తన అనుచరులకు సీట్లు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, మధిరలో ప్రయత్నాలు సాగ్గా కేవలం మధిర నుంచి అప్పట్లో ఆయన అనుచరుడిగా ఉన్న లింగాల కమల్‌రాజ్‌కు టిక్కెట్ దక్కింది. దీంతో పొంగులేటి శిబిరం నిరాశకు లోనైంది. ఈ ఎన్నికల్లో మధిరలో తన అనుచరుడి విజయం కోసం పొంగులేటి శాయశక్తులా కృషి చేసినప్పటికీ అక్కడ ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు ఉండగా అందులో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. పార్టీ ఇంత ఘోరంగా జిల్లాలో దెబ్బ తినడానికి పొంగులేటి కారణమని నేతలంతా కేసీఆర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేశారు.
నేతల ఫిర్యాదుతో కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2018 ఎన్నికల ఓటమిని సాకుగా చూపిస్తూ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ సైతం నిరాకరించారు. దీంతో పొంగులేటి అనుచరులు కనీసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి చేసినప్పటికీ పొంగులేటి మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. అయితే అప్పట్నుంచి పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ లభిస్తుందని ప్రచారం సాగింది.
ముందస్తుగానే కేసీఆర్ తన వ్యూహాన్ని అమలు చేశారా..?
పొంగులేటి వ్యవహార శైలితో తరుచుగా జిల్లాలో వర్గపోరు ముదరడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని ముందస్తుగానే అమలు చేసినట్లు తెలుస్తోంది. ఓ వైపు మాజీ ఎంపీ పొంగులేటి పార్టీ పరంగాను, మిగిలిన పదవులు ఇవ్వకుండానే బలమైన ఆర్థిక సామాజిక వర్గానికి చెందిన వారికి సముచిత స్థానం కల్పించారు. ఇటీవల రాజ్యసభ ఎంపీలుగా హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్రకు స్థానం కల్పించారు. వీరితోపాటు ఆర్థిక మూలాలు ఉన్న నేతలకు ప్రాధాన్యత కల్పిస్తూ పొంగులేటికి ముందుగానే చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. పొంగులేటి ఎలాగైనా పార్టీ మారతారనే నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ పొంగులేటి పార్టీ మారడం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా బలమైన నేతలను ఖమ్మం జిల్లాలో సముచిత స్థానం కల్పించినట్లు తెలుస్తోంది.
అనుకున్నట్టుగానే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం, ఆ తర్వాత ఆయన సెక్యూరిటీ తగ్గించడం వెనువెంటనే జరిగిపోయాయి. తాజాగా ఇప్పటి వరకు పొంగులేటి వెంట ఉన్న వారిని పార్టీ మారకుండా చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరి పొంగులేటి పార్టీ మారితే ఇప్పటి వరకు ఆయనతోపాటు ఉన్న వారు ఎంత మంది వెళ్తారు..? పొంగులేటి పార్టీ మారుతారా..? అనేది వేచి చూడాల్సిందే. 2017 పాలేరు ఉపఎన్నికలు, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పొంగులేటి తీసుకున్న నిర్ణయం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
ఖమ్మంలో సభ కూడా అందుకేనా.
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పెట్టాలని కేసిఆర్ నిర్ణయించారు. ఇందుకు ఖమ్మం జిల్లానేతలతోపాటు హారీష్ రావు, ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో పొంగులేటి ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పటికే ఆయన అన్నపురెడ్డిపల్లిలో కార్యకర్తలతో మాట్లాడుతూ తాను ఎక్కడికో పోయి కండువా మార్చుకోను ఖమ్మంలో రెండున్నర లక్షల మంది సమక్షంలో కండువా మార్చుకుంటానని చెప్పడంతో ఇంకాస్త పొలిటికల్ హీట్ పెరిగింది.
2014, 2018లో తెలంగాణ అంతటా టీఆర్ఎస్ ప్రభంజనం చూపినా ఖమ్మంలో మాత్రం రెండు సార్లు ఒక్కసీటుకే పరిమితమైంది. దీంతో కేసిఆర్ ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నెల 18న ఖమ్మంలో సభకు జిల్లాలో బలంగా ఉన్న వామపక్షాల నేతలను కూడా ఆహ్వానించారు. వారు సభకు రావడానికి అంగీకరించారు. వామపక్షాల కార్యకర్తలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అటు బోర్డర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ జన సమీకరణ చేసి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌దేననే సంకేతాలు ఇవ్వనున్నారు. మరోవైపు పొంగులేటి కూడా సాధ్యమైనంత మందిని బీఆర్ఎస్‌ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.