(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan Delhi Tour : గురువారం ప్రధానితో సీఎం జగన్ భేటీ - ఎందుకంటే ?
సీఎం జగన్ గురువారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రితో సమావేశం కానున్నారు.
CM Jagan Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ ఫిక్స్ కావడంతో ఆయనతో భేటీకి ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్ పదిరోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండి సోమవారం తిరిగి వచ్చారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం కావాలని నిర్ణయించుకోవడం రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని ప్రతీ సారి మీటింగ్ తర్వాత ప్రెస్ నోట్ మాత్రం విడుదల చేస్తారు. కానీ ఎప్పుడూ సీఎం జగన్ మీడియాతో సమావేశం పెట్టలేదు.
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై సానుకూలంగా కేంద్రం !
అయితే ఎన్ని సార్లు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి సమావేశం అయినప్పటికీ వినతి పత్రం ఇస్తున్న ఏ అంశాల్లోనూ పురోగతి కనిపించడం లేదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. పోలవరం సహా అనేక అంశాల్లో పదే పదే లేఖలు రాస్తున్నా.. అధికారులు వెళ్లి అడుగుతున్నా ముందడుగు పడటం లేదు. అయితే కొన్ని అంశాల్లో కేంద్రం చూసీ చూడనట్లుగా ఉండటం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. అప్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కాగ్, అకౌంటెంట్ జనరల్ కార్యాలయాలు అడుగుతున్నా... పూర్తి స్థాయిలో వివరాలను ఏపీ అధికారులు ఇవ్వలేకపోతున్నారు. అయినప్పటికీ అప్పులకు సంబంధించిన అనుమతులు లభించింది. దీంతో ఒక్క నెలలోనే రూ. తొమ్మిదిన్నర వేల కోట్ల వరకూ రుణాలు తెచ్చుకోగలిగారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అప్పులకు అనుమతి రాలేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో భేషరతులు మద్దతు ప్రకటిస్తారా ?
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ బీజేపీనిలబెట్టే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించేందుకు సీఎం జగన్ వెళ్తున్నారన్న ఓ వాదన కూడా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. వైఎస్ఆర్‌సీపీ మద్దతు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రత్యేకహోదా షరతు పెడతారా ?
గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రితకో అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. భేటీ అయిన తర్వాత ఏ ఏ అశాలపై చర్చించారన్న అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిపక్షాలు.. సోషల్ మీడియాలో ఇతర పార్టీల కార్యకర్తలు ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కీలకం కాబట్టి ప్రత్యేక హోదా సాధిస్తారా అన్న ప్రశ్నలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.