Vijayawada YSRCP : బెజవాడ పార్లమెంట్‌కు ఎస్సీ అభ్యర్థి- ఊహించని స్ట్రాటజీతో వైఎస్ఆర్‌సీపీ
విజయవాడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా దళిత నేతను ఎంపిక చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. అన్ని సమీకరణాలకు ఈ ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
Vijayawada YSRCP : విజయవాడ ఎంపీ స్థానంపై వైఎస్సార్సీపీ కొత్త స్ట్రాటజీ వర్కవుట్ చేస్తోంది. ఎవరూ ఊహించని వర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టబోతోంది. విజయవాడలో గెలవడం కంటే.. ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం చూపించాలనుకుంటోంది. వైఎస్ జగన్ స్వయంగా తీసుకున్న డెసిషెన్ ఏంటంటే.. ?
విజయవాడ నుంచి దళిత అభ్యర్థికి అవకాశం
విజయవాడకు YSRCP ఎస్సీ అభ్యర్థి కోసం వెతుకుతోంది. మీరు చదువుతోంది నిజమే. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ వైబ్రేషన్స్ ఉండే విజయవాడలో.. అదీ జనరల్ సీట్లో ఎస్సీ అభ్యర్థిని పెట్టబోతున్నారు. అందుకు “సరైన అభ్యర్థి” కోసం అన్వేషణ కూడా మొదలైపోయింది. విజయవాడ అంటే చాలా డిమాండ్ ఉన్న సీటు. పెద్ద పెద్ద వ్యక్తులెందరో అక్కడ నుంచి పోటీ చేయాలని తహతహలాడే సీటు. సీటును వెతుక్కుంటూ... అభ్యర్థులు క్యూ కట్టే పరిస్థితి ఉన్న చోట.. అభ్యర్థుని వెతకడానికి అన్వేషణ చేయడమేంటనే సందేహం రావొచ్చు. కానీ జగన్ లెక్కలు ఆయనకుంటాయ్ కదా..
విజయవాడ- ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్న ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా అది పొలిటికల్ పిన్ పాయింట్. 1950 లనుంచే కీలక రాజకీయ సమావేశాలకు, మలుపులకు కేంద్రం. ఈ నియోజకవర్గం నుంచి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ వంటి పండితులు, కేఎల్ రావు వంటి విఖ్యాత ఇంజనీర్లు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రులుగా వ్యవహరించారు. అయితే 1980ల నుంచి ఈ నియోజకవర్గంలో ఓ సామాజికవర్గ ప్రాతినిధ్యంలోకి వెళ్లిపోయింది.
విజయవాడ అంటే కమ్మ సీటు !
విజయవాడ అంటేనే కమ్మ సీటు అని 40 ఏళ్లుగా అనధికారికంగా డిసైడ్ అయిపోయింది. 1980లో చెన్నుపాటి విద్య ఇక్కడ గెలుపొందారు. ఆవిడ కమ్మ వ్యక్తిని వివాహం చేసుకున్న బ్రాహ్మిన్. అయితే ఆ కుటుంబం కులాన్ని త్యజించింది కాబట్టి ఆవిడను మినహాయించినా.. ఆ తర్వాత అక్కడ పోటీ చేసిన ప్రధాన వ్యక్తులు, గెలుపొందిన వారు కూడా కమ్మనే. 1984లో వడ్డే శోభనాద్రీశ్వరరావు చెన్నుపాటి విద్యపై, 89లో ఆవిడ వడ్డేపై, 1991లో వడ్డే శోభనాధ్రీశ్వరరావు విద్యపై, 1996లో పర్వతనేని ఉపేంద్ర- వడ్డే పై, 1998లోఉపేంద్ర దాసరి జై రమేష్‌పై, 1999లో గద్దే రామ్మోహన్ ఉపేంద్రపై, 2004లో లగడపాటి రాజగోపాల్ అశ్వనీదత్ పై, 2009లో వల్లభనేని వంశీపై, 2014లో కేశినేని శ్రీనివాస్ (నాని) కోనేరు ప్రసాద్ పై , 2019లో పొట్లూరి ప్రసాద్‌పై గెలుపొందారు. నలభై ఏళ్లుగా చూసుకుంటే.. గెలుపొందిన వారు.. వారిపై ఓడిన వారూ కూడా కమ్మ అభ్యర్థులే. మొదట్లో తెలుగుదేశం- కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ కాస్ట్ ఈక్వేషన్ లో మాత్రం మార్పు రాలేదు. అందుకే విజయవాడ ఎంపీ సీటు కమ్మ అని ఒక అనధికార డిక్లరేషన్. అందుకు కారణం కూడా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో కూడిన పశ్చిమ కృష్ణలో కమ్మ, బందరుతో కూడిన తూర్పు కృష్ణలో కాపు జనాభా, రాజకీయ ప్రాబల్యం ఎక్కువ. కాబట్టి ఈసీట్లను ఆ కులాలకే కేటాయించేవారు. బందరులో మార్పులు జరిగాయి కానీ.. విజయవాడ మాత్రం 40ఏళ్లుగా అదే కొనసాగుతోంది. అలాంటి ఆనవాయితీకి జగన్ బ్రేక్ వేయబోతున్నారు.
ఎస్సీ అభ్యర్థికి సీటుతో చాలా లెక్కలు సరి..!
ఇక్కడ జగన్ లెక్కలు చాలా క్లియర్. వంశీ, కొడాలి నాని వంటి వాళ్లు పోటీ చేస్తున్న బందరు పార్లమెంట్ సంగతేంటో కానీ.. విజయవాడ పార్లమెంట్ పరిధిలో కమ్మ కులం ఈ సారి జగన్ వెంట నిలవదు అనే అభిప్రాయం ఉంది. తెలుగుదేశం- వైసీపీ ఇద్దరు కమ్మ అభ్యర్థులనే పెడితే కచ్చితంగా ప్రయోజనం తెలుగుదేశానికే ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఒక ఎస్సీని నిలబెడితే... ఒక జనరల్ స్థానంలో రిజర్వ్డుడ్ అభ్యర్థిని నిలబెట్టిన క్రెడిట్ వైసీపీకి వస్తుంది. అంతేకాదు. ఇందులో ఇంకో లెక్క కూడా ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ జనాభా ఎక్కువ. నందిగామ, తిరువూరు రిజర్వుడ్ సీట్లు రెండు ఉన్నాయి. జగ్గయ్యపేటలో కూడా ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో విజయవాడ నగరంలోలో ఎస్సీ జనాభా చాలా ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. అంతే కాదు. విజయవాడను ఆనుకుని ఉన్న పామర్రు కూడా ఎస్సీ నియోజకవర్గం. అన్నిచోట్ల మాదిగ కమ్యూనిటీ ఎక్కువుగా ఉంది. మిగిలిన చోట్ల అయితే మాల కమ్యూనిటీతో పోటీ ఉంటుంది. విజయవాడలో మాదిగలకు ఇవ్వడానికి అలాంటి పోటీ లేదు.
జనరల్ స్థానంలో దళితులకు చోటిచ్చామని విస్తృత ప్రచారం చేసుకునే చాన్స్
ఒక జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేయొచ్చు. పార్లమెంట్ స్థానంలో పోటీ కష్టంగా ఉన్నా.. పార్లమెంట్ అభ్యర్థి మీద ఉండే సానుకూలతతో ఎస్సీలు అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఓట్లు వేయోచ్చు. ఎక్కడైనా తక్కువ మార్జిన్‌తో సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంటే ఇది ఉపయోగపడుతోంది. ఎస్సీ జనాభా అంతా కన్సాలిడేట్ అయితే ఎంపీ సీటు కూడా రావొచ్చు. ఇవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. ఇక విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అవుతోంది. 125 అడుగుల ఈ విగ్రహ నిర్మాణం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. దానిని పూర్తి చేసి విజయవాడ కేంద్రంగానే ఎస్సీ అభ్యర్థిని అనౌన్స్ చేసి ఆ క్రెడిట్ సాధించాలన్నది వైస్సార్సీపీ వ్యూహం.
జగన్ డెసిషన్ ఇది...!
సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ లెక్కలు ఎలా ఉంటాయో.. 2019లో అందరికీ అర్థం అయింది. పూర్తిగా రెడ్డి డామినేషన్ ఉన్న అనంతపురం వంటి చోట కూడా బీసీ అభ్యర్థులను ఎంపీలుగా నిలబెట్టారు. దీనిపై ఎంత ఒత్తిడి వచ్చినా వెనుకడుగువేయలేదు. అనంతపురం జిల్లాలో కురబ, బోయ లకు అవకాశం ఇచ్చారు. కేవలం సామాజిక వర్గం దన్ను ఉందనే కారణంగానే కొందరి మంత్రులపై ఆరోపణలు వచ్చినా కొనసాగించారు. నగర పాలక, మనిసిపాలిటీ ఎన్నికల్లో జిల్లా నాయకత్వం ఊహించని అభ్యర్థులను మేయర్లుగా, ఛైర్మన్లుగా ప్రకటించారు. విజయవాడ, విశాఖ మేయర్లు ఎవరన్నది చివరి నిమిషం వరకూ అక్కడ ముఖ్య నేతలకు కూడా తెలియలేదు అంటే.. జగన్ ఎంత కాలిక్యులేటెడ్‌గా వర్క్ చేశారో అర్థం చేసుకోవాలి. అనంతపురంలో జనరల్ స్థానాల్లో ముస్లింలకు, బీసీలకు, చైర్మన్ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.
“సరైన అభ్యర్థి” కోసం అన్వేషణ
పార్టీ అధినేత సూచనల మేరకు వైఎస్సార్సీపీ ముఖ్యులు.. అభ్యర్థి కోసం చూస్తున్నారు. నాన్ పొలిటికల్ అభ్యర్థి అయితే బాగుంటుదనే ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఐఏఎస్, ఐపీఎస్‌లు, లేదా ఇతర ఉన్నతాధికారుల్లో మాదిగ సామాజికవర్గం వ్యక్తుల కోసం పరిశీలన చేస్తున్నట్లుగా సమాచారం. డొక్కా మాణిక్య వరప్రసాద్ ను కూడా ఆప్షన్‌గా పరిశీలిస్తున్నప్పటికీ ఆయన ఎంత వరకూ ఒప్పుకుంటారో అన్న అనుమానం ఉంది. ప్రస్తుతానికైతే..అధికారుల కోసం వేట సాగిస్తున్నారు.