AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
MLAs Controversies: ఏపీలో దారి తప్పుతున్న కూటమి ఎమ్మెల్యేలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్నారు. . దగ్గుపాటి ప్రసాద్, చిర్రి బాలరాజు వంటి వారు అధినేతల మాటల్నీ లెక్క చేయడం లేదు.

AP NDA Coalition Internal Politics: ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు , ప్రజాప్రతినిధులకు అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని పదే పదే దిశానిర్దేశం చేస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు వ్యక్తిగతంగా పిలిపించి క్లాస్ పీకినా, హెచ్చరికలు జారీ చేసినా కొందరు నాయకులు మాత్రం తమ పాత అలవాట్లను మానుకోకపోవడం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది.
తలనొప్పిగా మారుతున్న కొంత మంది ఎమ్మెల్యేలు
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ , పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుల వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. అనంతపురంలో అధికారులు, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్ల ఆరోపణలు రావడంతో పాటు ఆడియో క్లిప్పులు వైరల్ కావడం స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు పోలవరం నియోజకవర్గంలో ఇసుక మైనింగ్ దందాలు, దేవుడి భూముల వివాదాలు, రూ.21 లక్షల డీలింగ్స్ ఆడియో లీక్‌లతో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వార్తల్లో నిలిచారు. గతంలోనే పవన్ కళ్యాణ్ ఈయన్ను పిలిపించి హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, ఏకంగా ఓ హైలెవెల్ ఎంక్వైరీ కమిటీని నియమించి సీరియస్ యాక్షన్‌కు శ్రీకారం చుట్టారు.
మరికొంత మంది ఎమ్మెల్యేల తీరూ అదే
వీరిద్దరే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర , కోస్తా జిల్లాలకు చెందిన మరికొందరు కూటమి ఎమ్మెల్యేలు కూడా అధికారులపై బెదిరింపులకు దిగడం, ఇసుక-మద్యం మాఫియాలతో చెయ్యి కలపడం, స్థానిక కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు డిమాండ్ చేయడం వంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మేము కష్టపడి అధికారాన్ని తెస్తే.. వీరు ఐదేళ్ల మైండ్‌సెట్‌తో దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని స్థానిక క్యాడర్, కూటమి శ్రేణులు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యేల అతివల్ల ప్రభుత్వం కష్టపడి తెచ్చుకుంటున్న మంచి పేరు కాస్తా తుడిచిపెట్టుకుపోతోందనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అందర్నీ గుర్తించిన కూటమి పార్టీలు
ఈ క్రమంలో కూటమి అధిష్టానాలు అంతర్గత సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, వారిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై పక్కా నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన, సోషల్ మీడియా ట్రాకింగ్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదనే స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల స్వేచ్ఛా దోపిడీ వల్లే ప్రజలు వారిని తిరస్కరించారనే విషయాన్ని గుర్తుచేస్తూ, పార్టీ పరువు తీసే నాయకులను దూరం పెట్టడమే మేలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతానికి మొదటి దశగా పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ కమిటీ నియామకంతో విచారణ ప్రారంభించగా, విచారణ నివేదికల ఆధారంగా అక్రమాలు రుజువైతే పార్టీ బాధ్యతల
నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీలో గీత దాటే వారికి ఫైనల్ డెడ్ లైన్
టీడీపీలోనూ వివాదాస్పద ఎమ్మెల్యేలకు చంద్రబాబు లాస్ట్ అండ్ ఫైనల్ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. మార్పు రాకపోతే రాబోయే రోజుల్లో వారిని శాసనసభాపక్షం నుంచి పక్కనబెట్టడం వంటి కఠిన చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమికి ఈ వివాదాస్పద ఎమ్మెల్యేల ప్రవర్తన పెద్ద పరీక్షగా మారింది. అధినేతలు కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా, ఒకరిద్దరిపై బహిరంగంగా కఠిన చర్యలు తీసుకుంటేనే మిగిలిన నాయకుల్లో భయం, క్రమశిక్షణ నెలకొంటాయని సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















