పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ, జనవరి 3 నుంచి సమీక్ష సమావేశాలు
శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ...పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
BRS Review Meetings : శాసనసభ ఎన్నికల్లో ( Assembly Elections) దెబ్బతిన్న బీఆర్ఎస్ (BRS)పార్టీ...పార్లమెంట్ ఎన్నికల్లో (General Elections 2023) సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ (Telangana) తరపున ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై సమీక్షలు చేసుకుంటూనే..పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలపై అంతర్గతంగా సమీక్షలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా నేతలతో సన్నాహాక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3 నుంచి లోక్ సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేయనుంది. జనవరి 3న ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం అవుతాయి. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి, 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతాయి. తెలంగాణ భవన్‌లో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతికి మూడు రోజుల విరామమివ్వనున్నారు. పండుగ తర్వాత రెండో విడత సమావేశాలను నిర్వహించనుంది.
నియోజకవర్గానికి 5వందల మందికి ఆహ్వానం
తెలంగాణ భవన్ లో జరిగే సమీక్షా సమావేశాలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీలతో పాటు వంద మంది నేతలతో పాటు 5వందల మంది కార్యకర్తలకు ఆహ్వానాలు పంపనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, ప్రత్యర్థులు విజయానికి అనుకూలించిన పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరు, పార్టపై ప్రజలకు ఉన్న అభిప్రాయం, నేతల బలాబలాలపై సుదీర్ఘంగా చర్చించున్నారు. సమావేశంలో వచ్చిన రిజల్ట్ ను బట్టి పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేయనుంది. తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. పార్లమెంట్ స్థానాలు సమీక్ష ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలపైనా బీఆర్ఎస్ సమీక్ష చేయాలని నిర్ణయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి మళ్లీ టికెట్లు ఇవ్వవద్దని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమి పాలయిన మంత్రులను మరో రకంగా ఉపయోగించుకోవడంపై బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.
Also Read: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోస్ట్
Also Read:ఫ్రీ బస్ ఎఫెక్ట్ - మహిళలతో నిండుతున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తోన్న పురుషులు