(Source: ECI/ABP News/ABP Majha)
TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్ దూకుడు
BJP vs TRS In Telangana: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ సరికొత్త పంథాకు తెరతీస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో బీజేపీకు కళ్లెం వేయాలని భావిస్తోంది
TRS vs BJP Politics: హుజూరాబాద్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ సరికొత్త పంథాకు తెరతీస్తోంది. వడ్ల కొనుగోలు విషయంలో ఢిల్లీలో ధర్నా చేసిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత కొద్దిగా వెనుకంజ వేయడం, ఓ వైపు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర (Praja Sangrama Yatra)తో ప్రజల్లోకి వెళుతుండటంతోపాటు బీజేపీ పెద్దలు తరుచూ పర్యటనలు చేస్తూ టీఆర్‌ఎస్‌ను ఇరుకునపెడుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు సిద్దం కావాలని టీఆర్‌ఎస్ బావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం నిధులపై ఎదురుదాడి..
లెక్కలు చూపించండి అని రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నాయి. మీరు నిధులు ఇవ్వలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే... అదిగో మేం ఇచ్చింది ఇంత అని బీజేపి చెబుతోంది. మీ పథకాలు కావని రాష్ట్రంలో అమలవుతున్నవి మీవి కాదు మావే అంటూ ఒకరినొకరు సోషల్ మీడియా వేదిక విమర్శించుకుంటున్నారు. అటు టీఆర్‌ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధానంగా తెలంగాణకు కేంద్రం ఇచ్చే నిధులపైనే బీజేపీ నేతలు దృష్టిసారించారు. అయితే నేతలు మాట్లాడే సమయంలో లెక్కల చెప్పే క్రమంలో బీజేపీ నేతలు అమిత్ షా, బండి సంజయ్, మరో నేత మూడు రకాలుగా లెక్కలు వెల్లడించారు. ఈ లెక్కలు మూడు మూడు రకాలుగా చూపించడంతో ఇటీవల కాలంలో సోషల్‌మీడియా వేదికగా టీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే కాకుండా తెలంగాణ నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టమైన గణాంకాలు సేకరించి కిందిస్థాయి నాయకుల వరకు దీనిపై అవగాహన కల్పించాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబందించి పూర్తి గణాంకాలు తయారు చేసే పనిలో టీఆర్‌ఎస్ నేతలు నిమగ్నమైనట్లు సమాచారం.
టార్గెట్ వయా ఎంఐఎం..
దీంతోపాటు టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసేందుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని అస్త్రంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో బాగంగానే టీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తుందనే ప్రచారం ప్రతి సభలో బీజేపీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తమకు సంబందం లేదని, బీజేపీకి ఎంఐఎం ‘బి’ టీమ్‌గా ప్రచారం చేసే పనిలో టీఆర్‌ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపీకి జరిగిన లాభాన్ని చూపేందుకు టీఆర్‌ఎస్ నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా మీటింగ్ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన కేటీఆర్ ‘అసదుద్దీన్ భుజంపై తుపాకీ పెట్టి ఎంత మందిని కాలుస్తారు..’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పథకాలతో ప్రచారం..
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అందిస్తున్న నిధుల వల్లే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సాగుతున్నాయనే ప్రచారం చేసేందుకు ఆ పార్టీ సిద్దమైంది. అయితే దీనికి సరైన జవాబు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ పెట్టిన పథకాలను బీజేపీ కాపీ కొడుతుందనే విషయాన్ని ప్రచారం చేసేందుకు టీఆర్‌ఎస్ నేతలు సిద్దమయ్యారు. ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్పడం వల్ల దానిని నిజం చేసేందుకు బీజేపీ సిద్దమైందని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో పాగావేయాలని చూస్తున్న బీజేపీని అదే స్థాయిలో గట్టిగా ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ సిద్దమైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా రెండు పార్టీల మద్య గట్టి వార్ నడుస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా 27 ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో తమ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఇచ్చిందో చెప్పాలని, ఎన్ని నిధులు ఇచ్చిందో క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సైతం ట్వీట్లు చేశారు. అయితే రెండు పార్టీలు లెక్కలు చెబుతున్నాయి సరే కానీ అసలు లెక్కలేంటనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతెందుకు అసలు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని నిధలు వచ్చాయి.... ఎంత మనీ ట్యాక్స్ ల రూపంలో కేంద్రానికి కడుతున్నామో, ఎంత కేంద్రం తిరిగి ఇస్తున్నారో ఓ శ్వేత పత్రం విడుదల చేస్తే సరిపోతుంది కదా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.