Telangana Politics : ద్రౌపది ముర్ముకు తెలంగాణ నుంచి ఎన్ని ఓట్లు ? క్రాస్ ఓటింగ్ జరిగిందా ?
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ అలాంటి సూచనలేమీ కనిపించలేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Telangana Politics : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ము ప్రచారానికి హైదరాబాద్ రాలేదు. దీనికి కారణం ఉంది. ఆమెకు తెలంగాణలో మద్దతు కేవలం బీజేపీ నుంచే ఉంది. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేస్తారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ఓటు వేస్తారు. నికరంగా మూడు ఓట్లు మాత్రమే ద్రౌపది ముర్ముకు పడతాయి. అటు అధికార టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుప్రకటించాయి. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఈ పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు. తమకు ఉంది మూడు ఓట్లే అయినా మరో పది మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు.
బీజేపీ నేతలు అంతర్గతంగా కొద్ది రోజులుగా ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటేయమని ప్రచారం చేస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల్ని సంప్రదించినట్లుగా ఆ పార్టీ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. ఆ ధీమాతోనే కనీసం పది మంది ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హాకు కాకుండా ద్రౌపది ముర్ముకు ఓటు వేస్తారని చెబుతున్నారు. అయితో ఓటింగ్ సరళిని చూస్తే క్రాస్ ఓటింగ్ జరగలేదని తేలుస్తోంది. తెలంగాణలో ఓట్లు వేసిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు మాత్రమే వివాదాస్పదమయింది. ఆమె ఓటు ఎన్డీఏ అభ్యర్థి అయినముర్ముకు వేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆమె వెంటనే ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు.
Wrong speculations are roaming about my #PresidentialElection vote if I voted for NDA why would I ask for another ballot before I caste my vote? Their was sketch mark on top of the ballot not on the names so I asked another ballot EC denied it, voted for My party candidate. pic.twitter.com/8ULeTq4yqI
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) July 18, 2022
సీతక్క అంశం ప్రచారంలోకి వచ్చింది కానీ ఇంకెవరనా అనుమానాస్పదంగా వ్యవహరించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. అాలగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పకడ్బందీగానే ఓటు వేశారు. ఎవరూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగాపోలింగ్ సరళిలో వెల్లడి కాలేదు.
బీజేపీ నేతల క్రాస్ ఓటింగ్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయో లేదో ఎవరికీ తెలియదు. 21 వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాతనే అసలు విషయం తెలుస్తుంది. నిజానికి బీజేపీ నేతలు ఇలా ప్రచారం చేసుకోవాల్సిన అవసరంలేదని క్రాస్ ఓటింగ్ జరిగితే లెక్కింపులో తెలిసిపోతుందని అంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా పది కాదు.. కనీసం ఐదు ఓట్లు క్రాస్ అయినా బీజేపీ సంచలనం సృష్టించినట్లే అనుకోవచ్చంటున్నారు.